అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో బెంగళూరు వెళ్లే రహదారికి మధ్యలో నాలుగు నెలల కిందట పెద్ద గొయ్యి ఏర్పడింది. దీన్ని పూడ్చాలని పలువురు పట్టణవాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో ఆందోళనలూ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు, పాలకుల తీరుపై స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. గొయ్యి పడిన ప్రాంతంలో సోమవారం ఫ్లెక్సీని అతికించి ఒక హుండీని ఏర్పాటు చేశారు.
'చందా వేద్దాం.. కళ్లు తెరిపిద్దాం'
'హుండీలో మీకు తోచినంత వేయండి. చేయిచేయి కలుపుదాం.. రోడ్డును బాగు చేద్దాం. మన ఊరిని మనం కాపాడుకుందాం.. ఓట్లు వేసి గెలిపించిన నాయకులకు బుద్ధి రావాలంటే ఈ మాత్రం చేయాల్సిందే' అని ఫ్లెక్సీలో రాసి ఉంది. అటుగా వెళ్తున్న వారంతా ఫ్లెక్సీని చదువుతూ హుండీలో డబ్బులు వేసి వెళ్తుండటం విశేషం. ఇంతకీ ఆ హుండీ కథ ఏంటో తెలుసుకోండి.
యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఈవిధంగా రాసిపెట్టి చందాల కోసం హుండీని సిద్ధం చేశారు. 'ఇది ఎవరిని విమర్శించడానికి కాదు 2019లో చేసిన ఒక తప్పుకి ఇంత పెద్ద శిక్ష పడింది. కదిరి పట్టణం నిత్యం రద్దీగా ఉండే టవర్ క్లాక్ దగ్గర నడిరోడ్డులో రంధ్రం ఏర్పడి..దాదాపు నాలుగు నెలలు అయింది. ఆ రోడ్డు మార్గంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులు, అవసరాల నిమిత్తం కదిరికి వచ్చిపోయే వారంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కదిరి పట్టణ ప్రజలారా.. కదిరి పట్టణానికి వచ్చేవారు చెడుగా మాట్లాడకూడదని ఉద్దేశంతో ఒక మంచి పని చేద్దామని ఆలోచన వచ్చింది. అక్కడ ఒక హుండీ ఏర్పాటు చేస్తున్నాము. ఆ హుండీలో మీ మనసుకు నచ్చినంత సాయం చేయండి. చేయి చేయి కలుపుదాం రోడ్డును బాగు చేద్దాం..మనం ఓట్లు వేసి గెలిపించిన నాయకులకు బుద్ధి రావాలంటే ఈ మాత్రం చేయాల్సిందే'.
ఇదీ చదవండి : ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా