ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురం జిల్లాలో కుండపోత వర్షాలు

By

Published : Sep 13, 2020, 7:31 PM IST

అనంతపురం జిల్లావ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జీబీసీ కాలువకు గండి పడటంతో పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

అనంతపురం జిల్లాలో కుండపోత వర్షాలు
అనంతపురం జిల్లాలో కుండపోత వర్షాలు

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం కరకముక్కల గ్రామ సమీపంలోని గుంతకల్లు బ్రాంచ్ కాలువకు (జీబీసీ) గండి పడింది. దీంతో దాదాపు వంద క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. ఈ క్రమంలో జీబీసీ కాలువకు నీటిమట్టం తగ్గిపోయి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందే పరిస్థితి లేకుండా పోతోంది. అధికారులు వెంటనే స్పందించి ఈ గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

జిల్లాలోని గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాలలో శనివారం రాత్రి నుంచి ఏడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులు తెగిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లి గ్రామ సమీపంలోని వంతెన తెగిపోవడం వల్ల చిట్టూరు, గంజి గుంటపల్లి,దిమ్మగుడి, కొట్టాలపల్లి, చిత్ర చెడు, తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజకవర్గంలోని తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగురు, యాడికి మండలాల్లోని వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి.. పెద్ద వడుగురు, పెద్ద పప్పూరు మండలాల్లో వందల ఎకరాల్లోని పత్తి, వేరుశెనగ పంటలు నీట మునిగాయి.

విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చే పంట భారీ వర్షానికి నీట మునిగిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి

భారీ పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ

ABOUT THE AUTHOR

...view details