కరవు జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు పూటగడవటమే కష్టంగా మారింది. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయటంతో యాజమాన్యాలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వటంలేదు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు మాత్రం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తూ, బోధన చేస్తున్న టీచర్లకు సగం జీతం మాత్రం చెల్లిస్తున్నాయి. మండల ప్రాంతాల్లోని చిన్నపాటి కాన్వెంట్ స్కూల్ టీచర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న చాలా కుటుంబాలు ఒక్కపూట తిండికి కూడా నోచుకోక దుర్భరమైన జీవితం గడుపుతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొన్నిచోట్ల ఏప్రిల్ వరకు వేతనాలు ఇవ్వగా, మరికొన్ని చోట్ల విద్యార్థులు ఫీజులు చెల్లించటంలేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన ప్రైవేట్ టీచర్లు అనేకచోట్ల కనిపించగా, వ్యవసాయ పనులు మొదలు కావటంతో కూలీకి వెళుతున్నారు. ప్రైవేట్ స్కూల్ మూతవేయటంతో పంటపొలాల్లో కలుపు తీస్తూ కనిపించిన అక్కాచెల్లెళ్లను ఈటీవీ భారత్ పలకరించగా, ఇల్లు గడవటమే కష్టంగా మారిందని, కూలీ పని చేయాల్సి వచ్చిందని చెప్పారు. బీకాం, బీఎస్సీ లు చదివిన కూలీగా పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.