అనంతపురం జిల్లా అగళి మండలం ఎనగలూరుకు చెందిన నాగమ్మ సొంత కాళ్లపై నిలబడలేని దివ్యాంగురాలు. ఆమె కుమారుడు 11 ఏళ్ల మనోజ్‌కుమార్ శరీరం పూర్తిగా ముడుచుకుపోయింది. ఎముకలన్నీ వంగిపోయాయి. కనీసం పక్కకు దొర్లలేడు. ఆమె భర్త కదిరప్ప దినసరి కూలి. ఆధార్ అనుసంధానం చేయించుకోలేదన్న కారణంగా ప్రభుత్వం మూడు నెలలుగా వీరి పింఛన్ సొమ్మును నిలిపివేసింది.
కళ్లెదుట వైకల్యానికి కఠిన పరీక్షలేల?
ఆ తల్లి, తనయుడు విధి వంచితులు. ఇన్నాళ్లు ప్రభుత్వ పింఛన్‌తో జీవితాలు నెట్టుకొస్తున్న దివ్యాంగులు. ఇటీవల ఆధార్ అనుసంధానం కానందున ఇద్దరికీ పింఛన్ ఆగిపోవడంతో సోమవారం అనంతపురంలోని కలెక్టరేట్‌కు వచ్చి స్పందనలో అర్జీ ఇచ్చారు.
ఆధార్ లింకేజీ కోసం నాగమ్మ ఆటోలో బిడ్డను తీసుకొని హిందూపురం, మడకశిర, గుడిబండ, అగళి ప్రాంతాల్లోని ఆధార్ కేంద్రాలన్నీ తిరిగింది. ఎక్కడా పనికాలేదు. బాలుడికి పుట్టుకతోనే చేతివేళ్లు ముడుచుకుపోవడంతో వేలిముద్రలు పడలేదు. కళ్లు మూసుకుపోతున్నందున ఐరిస్‌తో అనుసంధానం కాలేదు. గత్యంతరం లేక సోమవారం ఓ యువతి సహాయంతో 150 కి.మీ. దూరంలోని జిల్లా కేంద్రానికి వచ్చి ‘స్పందన’లో అర్జీ ఇచ్చింది నాగమ్మ. కొన్ని నెలల కిందట ట్రై సైకిల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వం సాయం చేయాలని ఆ తల్లి చేతులెత్తి వేడుకుంటోంది.
ఇదీ చూడండి:శ్రీశైలం, తమ్మిలేరు, మున్నేరు జలాశయాలకు భారీ వరదలు