అనంత "కురుక్షేత్రం"
"జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలను అందించిన ఘనత... రాష్ట్రపతి పదవిని అలంకరించిన చరిత్ర ఆ జిల్లా సొంతం. నీలం సంజీవరెడ్డి.. తరిమెల నాగిరెడ్డి వంటి మహామహులను అందించిన ఆ నేల..తెలుగోడి ఆత్మగౌరవమంటూ దిల్లీపీఠాన్ని వణికించిన ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికీ.. వేదికైంది. అంతంటి చరిత్ర ఉన్న అనంతపురం జిల్లా మరో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. కిందటి ఎన్నికల్లో మాదిరిగా సైకిల్ పార్టీ స్పీడ్‌తో దూసుకెళ్తుందా..? ఫ్యాన్ గాలి వీస్తుందా..లేక ఛాయ్ గ్లాస్ సత్తా చాటుతుందా అనేదే ఆసక్తికరంగా మారింది.
విభేదాలు పక్కనపెడదాం, కలిసి నడ్డుదాం... అధినేతను మరోసారి పీఠం ఎక్కిద్దామనే లక్ష్యం అధికార పార్టీది. కిందటి ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా... ఈసారి మాత్రం విజయఢంకా మోగించాల్సిందేనన్న ఆశ ప్రతిపక్షపార్టీది. మాకేం తక్కువ మేం సత్తా చాటుతామంటుంది కొత్త పార్టీ... ఇది అనంతపురం జిల్లాలోని ప్రస్తుత రాజకీయం. మరీ ఇలాంటి పరిస్థితుల్లో అనంత పీఠాన్ని అందుకునేదేవరు.?
అనంతపురం జిల్లా పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. పార్టీ అభ్యర్థులు ఖరారు కాకముందే అన్ని పార్టీల నాయకులు కత్తులు దూస్తున్నారు. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో 12 స్థానాల్లో అధికార పార్టీ పాగా వేయగా 2పార్లమెంట్ స్థానాల్లోనూ తిరుగులేని విజయంఅందుకుంది. కదిరి స్థానం నుంచి గెలిచిన వైకాపా అభ్యర్థి చాంద్ బాష సైకిల్ ఎక్కగా... హైకోర్టు తీర్పుతో మడకశిర ఎమ్మెల్యే వీరన్న పదవి కోల్పోయారు. రెండోస్థానంలో ఉన్న వైకాపా అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు. కిందటి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన జోష్‌లో ఉన్న తెదేపా... మరోమారు అనంత గడ్డపై పసుపు జెండా ఎగరవేయాలనుకుంటోంది.
కిందటిసారి.. తెదేపా మెజార్టీ స్థానాలు గెలుపొందినప్పటికి... ప్రస్తుత పరిస్థితులు అంత సులువుగా లేవు. నేతల మధ్య కుమ్ములాటతో పలువురు ఎమ్మెల్యే పనితీరుపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. ఇదే విషయమై గుంతకల్లు, శింగనమల, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, కదిరి ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం సహా ఇంచుమించు అన్ని నియోజకవర్గంలోనూ టికెట్ రగడ నడుస్తోంది. తాడిపత్రి నుంచి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని బరిలో దింపాలని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత తిరిగి మరోసారి రాప్తాడ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి ఆమె కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఊహగానాలు కూడా వచ్చాయి. 2014ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వీచింది. పార్టీ సీనియర్ నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ పై వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి గెలుపొందారు. తెదేపా అధికారం చేపట్టిన తర్వాత పయ్యావులకు ఎమ్మెల్సీ పదవీ దక్కింది. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఆయనే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.పార్లమెంటు అభ్యర్థుల విషయంలోనూ మథనం జరుగుతోంది. ఇప్పటికే పోటీ చేయనని ప్రకటించేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... తన కుమారుడు పవన్‌కు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు, అనంతపురం జిల్లాకు హంద్రీనీవా నీటిని తీసుకెళ్లడం తెదేపాకు బాగా కలిసోచ్చేలా ఉంది. పెనుకొండలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు తెదేపాకు మైలేజీ పెంచే అంశంగా కనిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయంటున్నారు అధికార పార్టీ నాయకులు.
అధికారపార్టీతో పాటు వైకాపా, జనసేన, కాంగ్రెస్ లు మెజార్టీ స్థానాలు గెలించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి.నియోజకవర్గ బాధ్యులకే టికెట్లు ఇస్తామని తొలుత భావించినా ఫ్యాన్ పార్టీ...గెలుపు గుర్రాలకే టికెట్ అంటూ.. మార్పులకు సిద్ధమవ్వటంతో నేతల్లో కలవరం మొదలైంది.మరోవైపు అధికారంలోకి వస్తే హోదా ఇస్తామనే నినాదంతో ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తోంది.ఈ జిల్లాకే చెందిన పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి మరోసారి కల్యాణదుర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వామపక్షాలతో కలిసి నడించేందుకు సిద్ధమైన జనసేన పార్టీ బలమైన అభ్యర్థుల రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.
ప్రతిపక్ష పార్టీ వైకాపా లో నేతల మధ్య అంతరం పెంచుతున్న స్థానం..హిందూపురం నియోజకవర్గం. ఈ స్థానాన్ని ఆశించిన నవీన్ నిశ్చల్ టికెట్ వస్తోందని భావించినప్పటికీ...అధినాయకత్వం సుముఖంగా లేదు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనిని సమన్వయకర్తగా నియమించటంతో నవీన్ నిశ్చల్ మనస్థాపాన్నికి గురైనట్లు తెలుస్తోంది. హిందూపూరం పార్లమెంట్ స్థానానికి దాదాపు ఇదే పరిస్థితి.. ఈ సీటును నదీమ్ అహ్మద్ కు ఇస్తారని భావించినా...స్వచ్ఛంద విరమణ తీసుకున్న పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామంతో టికెట్ రాదని భావించిన నదీమ్..అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని కోరుతున్నారు. ఇదే స్థానాన్ని తెదేపాలో చేరి అనంతరం సొంతగూటికి చేరిన గుర్నాథరెడ్డి కూడా ఆశించటం వైకాపా అధినాయకత్వాన్నికి తలనొప్పిగా మారింది. పార్టీలో అంతర్గతపోరు ఉన్నప్పటికి...అధికార పార్టీ వైఫల్యాలే తమకు కలిసి వస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైకాపా నేతలు.
కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచిన కదిరి అసెంబ్లీ సీటును.. ఈసారి డాక్టర్ సిద్దారెడ్డికి ఖరారు చేస్తున్నట్లు ఆపార్టీ నేత, జిల్లా సమన్వయకర్త మిథున్ రెడ్డి ప్రకటించారు.ఈ ప్రకటన అనంతరం వైకాపా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వజ్ర భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో శింగనమల స్థానం నుంచి జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. అయితే మరోసారి ఆమెకే టికెట్ వస్తోందని భావిస్తున్నపట్టికీ...కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ వైకాపాలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన చేరిక లాంఛనమైతే శింగనమల స్థానం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే చాలా వరకు అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈవిషయంలో అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది.అంతేకాదు ఒక అడుగు ముందుకేసిన సైకిల్ పార్టీ...ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించినట్లు ప్రకటించేసింది. కిందటి ఎన్నికల్లో ద్విముఖపోరు ఉన్న అనంతలో వామపక్షాలతో జనసేన జట్టుకట్టిన వేళ జిల్లాలో ముక్కోణపు పోరుకు ఆజ్యం పోస్తుంది. పోటీ ఇచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న వేళ అనంత రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.