అనంతపురం జిల్లా మడకశిర మండలం తురకవాండ్లపల్లి గ్రామంలో 5 నెలల క్రితం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
మండలంలోని తురకవాండ్లపల్లి గ్రామ సమీపంలో మారెమ్మ దేవాలయం వద్ద 5 నెలల క్రితం కాలిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై మడకశిర పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పటినుంచి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ కర్ణాటక రాష్ట్రం తుంకూర్ జిల్లా పావగడ నియోజకవర్గంలోని నేరళ్లకుంట గ్రామంలో ముద్దాయి రామప్పను మడకశిర సీఐ రాజేంద్రప్రసాద్, సిబ్బంది అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలు, బంగారు, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, మృతురాలి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు...
ఈ కేసు వివరాలను మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. కర్ణాటకకు చెందిన రామప్ప ఎం.ఏ. హిస్టరీ, ఎంఫిల్ చదివాడు. గతంలో బెంగళూరు నగరంలోని ఓ కళాశాలలో పని చేశాడు. అక్కడ ఉద్యోగం పోవటంతో అనంతరం శ్రీ రవిశంకర్ విద్యా మందిర్ ఆయుర్వేదిక్ కళాశాల & ఆసుపత్రిలో ఉద్యోగం చేశాడు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న తుంకూరు జిల్లాకు చెందిన వసంతమ్మ అనే మహిళతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. చెడు వ్యసనాలకు బానిసైన నిందితుడు... తనకు డబ్బు అవసరం ఉందని వసంతమ్మ దగ్గర 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడిచినా వాటిని తిరిగి ఇవ్వకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వసంతమ్మ హెచ్చరించింది.