వారంతా ప్రైవేట్‌గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పేద యువకులే. ఆకలి బాధ తెలిసి పెరిగిన వారు. వాళ్లందరినీ కలిపింది మాత్రం తమలాంటి నిరుపేదల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన, సేవా భావన. ఎవరికివారు వేర్వేరుగా 5 స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపి.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సహృదయ సేవా సమితి వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఈ ఐదు సంస్థలకు చెందిన యువకులందరినీ ఏకతాటిపైకి తెచ్చాడు.
జనతా కర్ఫ్యూ నుంచే
బాలకృష్ణది నూనెమిల్లులో చిరుద్యోగం. తనకొచ్చే తక్కువ వేతనంలోనుంచే రాత్రిళ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్, రోడ్లపై ఆకలితో బాధపడే పేదలకు ఆహారం అందించేవాడు. పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో మిగిలిపోయిన ఆహారం తీసుకెళ్లి వారి ఆకలి తీర్చేవాడు. లాక్‌డౌన్ వల్ల మిల్లు మూతపడడం వల్ల... పూర్తిస్థాయిలో పేదల కోసమే పనిచేయడం మొదలుపెట్టాడు. జనతా కర్ఫ్యూ మొదలైన రోజు నుంచి... దాతల సహాయంతో నిత్యావసరాల పంపిణీ, ఆహారం సరఫరా కొనసాగిస్తున్నాడు.
అభాగ్యులకు అండగా
సహృదయ సేవాసమితి గురించి తెలిసి, మరో 4సేవాసంస్థల్లోని యువకులు బాలకృష్ణతో చేతులు కలిపారు. ఆదరణ సేవా సమాజ్, ఫ్రెండ్స్ సొసైటీ, రెడ్ డ్రాప్స్, గ్లోబల్ సోషల్ కాప్స్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ సంస్థలు కలిసి, యువ సైన్యంగా మారాయి. వీళ్లంతా లాక్‌డౌన్‌లో పేదలకు, అభాగ్యులకు అండగా నిలిచారు. నిత్యావసరాల పంపిణీ, వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులు, వారి బంధువులకు మూడుపూటలా భోజనం అందిస్తున్నారు.