Crime in Andhra Pradesh: అనకాపల్లి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల ప్రకారం జన్మభూమి రైలు ఎక్కుతుండగా ఒక మహిళ జారిపడింది. ఆమెను కాపాడడానికి ప్రయత్నించిన శంకర్ రావు అనే ప్రయాణికుడు జారి పడటంతో అతని కాలు విరిగిపోయింది. ఈ ప్రమాదంలో మరో ప్రయాణికురాలు అన్నపూర్ణ జారిపడటంతో తీవ్ర గాయాలయ్యాయి .
జన్మభూమి రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డారు. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును ఆపడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
పెళ్లయి నెలరోజులకే నవ వరుడు ఆత్మహత్య..శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం బాలతిమ్మనపల్లి లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయి నెలరోజులు గడవక ముందే నవ వధూవరులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వరుడు మనోజ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి తట్టుకోలేక వధువు జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వెంటనే కుటుంబ సభ్యులు జ్యోతిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మనోజ్ కుమార్ కు అప్పులు అధికంగా ఉండడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..అనంతపురం నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తన భార్యను ఉద్యోగం కోసం భర్త బైక్పై తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందింది. వివరాల ప్రకారం నాగులగుడ్డం గ్రామానికి చెందిన లక్ష్మన్న అనంతపురంలోని ఏజీఎస్ స్కూల్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి 7నెలల క్రితం శిల్ప అనే మహిళతో వివాహమైంది. శిల్ప డిగ్రీ చదవడంతో తనతో పాటు స్కూల్లో ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుందని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వారు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు.
దీంతో లక్ష్మన్న తన భార్యను తీసుకుని అనంతపురం వస్తుండగా వడియం పేట క్రాసింగ్ వద్ద ఒక లారీ వేగంగా వచ్చింది. శిల్ప కంగారుతో బైక్ పైనుంచి కింద పడింది. వెంటనే ఆ లారీ ఆమె మీదుగా దూసుకెళ్లింది. తీవ్రగాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కొత్తగా పెళ్లైన వారు ఉద్యోగం కోసం వెళ్తుండగా ఇలాంటి సంఘటన జరగడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.