ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరుగురు సజీవదహనం కేసు.. ఆమె చెప్పింది.. ఆస్తి ఊరించింది.. - ap jaza news

Mancherial District Fire Accident updates:మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవదహనం కేసులో విస్తుగొలిపే అంశాలు బయటకు వచ్చాయి. తన భర్తతో ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే కారణం ఓ వైపు.. డబ్బు అంతా ఆమెకే ఇస్తున్నాడనే కోపం మరోవైపు... వెరసి ఈ కుట్రకు దారి తీశాయి. ఈ క్రమంలోనే సదరు నిందితురాలు.. తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.

SIX murder case
ఆరుగురు సజీవదహనం

By

Published : Dec 21, 2022, 4:20 PM IST

Mancherial District Fire Accident updates: వేరే మహిళతో సంబంధం పెట్టుకుని.. తనకు డబ్బులివ్వడంలేదని, పట్టించుకోవడం లేదనే కక్షతో ఆమె తన భర్తను చంపేందుకు పథకం వేసింది. ఆస్తి ఆశ చూపి ప్రియుడిని ఉసిగొల్పింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు వ్యక్తులు సజీవదహనమైన కేసు వెనుక కుట్ర ఇది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ మంచిర్యాలలో మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

లక్షెట్టిపేట మండలం ఉట్కూర్‌కు చెందిన సృజనకు డాక్యుమెంట్ రైటర్‌ మేడి లక్ష్మణ్‌తో 2010లో పరిచయం ఏర్పడింది. అతని వద్ద ఆమె తీసుకున్న రూ.4 లక్షల అప్పు వసూలు క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటికే ఆమె భర్త, సింగరేణి ఉద్యోగి అయిన శనిగారపు శాంతయ్య గుడిపెల్లికి చెందిన పద్మతో అదే గ్రామంలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పద్మకే ఇస్తానంటూ శాంతయ్య తరచూ గొడవపడేవాడు.

పలుమార్లు పంచాయితీలూ జరిగాయి. శాంతయ్య జీతభత్యాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలూ తనకే దక్కాలని సృజనతో లక్ష్మణ్‌ కోర్టులో కేసు వేయించాడు. గొడవల నేపథ్యంలో భర్తపై కక్ష పెంచుకున్న సృజన.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకుని లక్ష్మణ్‌ను ఉసిగొల్పింది. ఉట్కూర్‌లో తన కుమార్తె మౌనిక పేరిట ఉన్న రూ. 1.50 కోట్ల విలువైన భూమి రాసిస్తానని అతడికి ఆశ చూపడంతో అతడు హత్యకు పథకం రచించాడు.

రెండుసార్లు వాహనంతో హత్యాయత్నం:లక్షెట్టిపేటలో పందుల వ్యాపారం చేసే శ్రీరాముల రమేశ్‌ (36)ను లక్ష్మణ్‌ సంప్రదించాడు. రూ.4 లక్షలు ఇస్తానని శాంతయ్యను హత్య చేయాలని కోరాడు. లక్షెట్టిపేటలోని కోమాకుల మహేశ్‌కు చెందిన బొలేరో వాహనాన్ని కొని రమేశ్‌కు ఇచ్చాడు. గుడిపెల్లిలో శ్రీను అనే వ్యక్తి ద్వారా ఆ ఊళ్లో ఉండే సమ్మయ్యను సంప్రదించి.. నిత్యం శాంతయ్య, పద్మల కదలికలను చెబితే.. రూ.1.50 లక్షలు ఇస్తామన్నారు.

అతడిచ్చిన సమాచారం ప్రకారం నెల కిందట పద్మ, శాంతయ్య మంచిర్యాల నుంచి గుడిపెల్లికి వస్తుండగా రమేశ్‌ బొలేరోతో ఢీకొట్టే ప్రయత్నం చేసి.. తానే కందకంలో పడిపోయాడు. నాలుగు రోజుల అనంతరం పద్మ, శాంతయ్య మంచిర్యాల ఆసుపత్రి నుంచి ఆటోలో వస్తుండగా మళ్లీ వాహనంతో ఢీకొట్టే ప్రయత్నం చేయగా వారు త్రుటిలో తప్పించుకున్నారు. పద్మకు గాయాలయ్యాయి. హత్యల కోసం రామకృష్ణాపూర్‌ అంగడిలో రెండు కత్తులు కొన్నా, దొరికిపోతామని ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చివరకు పెట్రోల్‌ పోసి చంపేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 16న మధ్యాహ్నం సమ్మయ్య రమేశ్‌కు ఫోన్‌ చేసి.. శాంతయ్య, పద్మ ఇంట్లోనే ఉన్నారని తెలిపాడు. దీంతో లక్ష్మణ్‌, రమేశ్‌లు మంచిర్యాలకు చేరుకుని మద్యం తాగారు. శ్రీపతిరాజు అనే వ్యక్తి ఆటోలో మూడు క్యాన్లలో పెట్రోలు తెప్పించారు. గుడిపెల్లి శివారులో వాటిని తీసుకుని.. సమ్మయ్య, రమేశ్‌లు గ్రామంలోకి వెళ్లారు. లక్ష్మణ్‌ అదే ఆటోలో మంచిర్యాలకు చేరుకుని ఓ లాడ్జిలో ఉండి ఉదయం లక్షెట్టిపేటకు వెళ్లాడు. మర్నాడు రమేశ్‌ అతడి వద్దకు వెళ్లి.. మంటల్లో ఆరుగురు చనిపోయారని చెప్పాడు. హత్యల అనంతరం వీరిద్దరూ తప్పించుకుని తిరుగుతుండగా మంచిర్యాల ఓవర్‌ బ్రిడ్జి వద్ద, శ్రీరాంపూర్‌ వద్ద సృజన, ఆమె తండ్రి అంజయ్యలను అదుపులోకి తీసుకున్నామని సీపీ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details