వరల్డ్‌కప్‌లో కోహ్లీ స్థానంలో రాయుడు...?
"పరిస్థితులకు అనుగుణంగా టాప్ ఆర్డర్‌ని విడదీస్తాం. విరాట్ స్థానంలో రాయుడు వచ్చే అవకాశముంది" అని కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అవసరమైతే నాలుగో స్థానంలో ఆడిస్తామని కోచ్ రవిశాస్త్రి తెలిపారు. వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో మిడిల్ ఆర్డర్లో విరాట్ కీలకం కానున్నాడని ఆయన అన్నారు. వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లో ఆడేటప్పుడు జట్టు సమతూకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
"ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ఓటమి గురించి నేను పట్టించుకోను, మాకు అక్కడ పరిస్థితులపై అవగాహన ఉంది" అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. హామిల్టన్ వన్డేలో 90 పరుగులతో అంబటి రాయుడు మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడని గుర్తుచేశారు. రాయుడు లేదా వేరే ఎవరినైనా మూడో స్థానంలో ఆడించే అవకాశముందని ఆయన అన్నారు.
రాయుడు బ్యాటింగ్ శైలి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉన్నప్పటికీ జట్టుకు అదనపు బలం చేకూరుస్తుందని వివరించారు రవిశాస్త్రి. "కొన్నిసార్లు అతడు అసాధారణ షాట్లు ఆడతాడు. అతని ఆట మ్యాచ్ ఫలితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది" అని కొనియాడారు.