భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలో చాలా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటాడు. కనురెప్పలు పడేలోపే వికెట్లు పడగొడుతుంటాడు. ప్రత్యర్థి కదలికల్ని నిశితంగా పరిశీలిస్తుంటాడు మిస్టర్ కూల్. తాజాగా హామిల్టన్‌లో కివీస్‌తో ఆఖరి టీ20 మ్యాచ్‌లోనూ ఓపెనర్ సీఫర్ట్‌ని స్టంపౌట్ చేయడం ఇలానే సంచలనమైంది. అలాంటి ధోని జాతీయ జెండా కింద పడిపోతుంటే అంతే అప్రమత్తంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ చేస్తుండగా ..జాతీయ జెండాని చేతిలో పట్టుకుని ఓ భారత అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. నేరుగా ధోనీ దగ్గరికొచ్చిన అభిమాని భావోద్వేగంతో కాళ్ల మీద పడిపోయాడు. వెంటనే అతని చేతిలోని జెండా నేలని తాకబోతుండటాన్ని గమనించిన ధోని.. స్పందించి అభిమాని చేతుల్లోంచి ఆ జెండాని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతడ్ని వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. ఆ తర్వాత జెండాని భద్రతా సిబ్బందికి అప్పగించాడు.
- భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ మరోసారి దేశభక్తిని చాటుకున్నాడు.