హత్యాచారానికి గురైన 'దిశ' కు ఎందరో మద్దతు పలికారు. ఆమె చావుకు కారణమైన వారు దొరకగానే శిక్షించాలని నిరసనలు వెల్లువెత్తాయి. న్యాయం జరగాలని ఆశించనివారే లేరు! తమకు అప్పగిస్తే తామే శిక్షిస్తామన్నవారూ లేకపోలేదు. దిశపై సామాజిక మాధ్యమాల్లో పిచ్చి రాతలు రాసిన వారినీ ఎండగట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకోగానే ఆనందించారు. మంచి పని అయ్యిందంటూ హర్షించారు. కాని దిశ హంతకుల ఎన్కౌంటర్తోనే ఏరివేత పూర్తికాలేదు.. చెప్పాలంటే అసలు మొదలు కాలేదు... అతివకు జరగాల్సిన న్యాయం ఇంకా చాలా ఉంది.
మానసిక అత్యాచారాలెన్నో... మనసు పడే వేదనలెన్నో! - encounter
నిక్కరు వేసుకున్నవాడు అబ్బాయి, గౌను వేసుకున్నది అమ్మాయి అన్న తేడా మినహా ఏమీ తెలియని వయసు. గురు బ్రహ్మ.. అంటూ ప్రార్థనలో వల్లె వేస్తూ ఆయన్నో దేవుడిలా చూస్తే.. ఆయనేమో ఆ వల్లె వేసిన పెదవులనే ఆక్రమించాలని ప్రయత్నిస్తే, నమస్కారానికి ప్రతిగా ఆశీర్వదించాల్సిన చేతులే ఆ చిన్న మేనిని ఎక్కడో తడిమితే... మనసులో రేగిన ఆ భయానికి సమాధానం ఎవరు చెబుతారు? దిశలాగే రోదిస్తున్న మనసులకు జవాబెవరు చెబుతారు!?
The agony of women on sexual assaults
నాదో చిన్న సందేహం.. కొన్ని ప్రశ్నలు అడగాలనుంది!
- మంచి చదువుకు పక్క ఊరు తప్ప దిక్కులేదు. నిల్చోవడానికే స్థలం లేదు. ఇక కూర్చునే అవకాశమెక్కడ? చేతిలో పుస్తకాలు, అవి కిందపడకుండా.. బ్యాలెన్సు తప్పకుండా చూసుకోవడం కత్తిమీద సామే. మీద పడేవారి నుంచి తప్పించుకుంటూ.. ఆ ఊపిరి సలపని స్థితి నుంచి ఎప్పుడెప్పుడు బయట పడతామా అన్న ఆతురతలో ఉన్న మనసుకి తండ్రి కంటే పెద్ద వయసు వాడు కాస్త చోటివ్వకపోగా ఆ పరిస్థితినీ అదనుగా తీసుకుంటే? చిన్ని మనసుకు తగిలిన గాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
- బయటి వారంతా బూచీలు. వారిని నమ్మకూడదు. వీలైనంత దూరంగా ఉండాలి. మనవాళ్లతోనే మనకు భద్రత.. అని భావించి ఆదమరపుగా ఉంటే.. అమ్మానాన్న లేని సమయంలో ఆక్రమించుకోవాలి అనుకుంటే.. అవమానపడిన అభిమానానికి ఎవరు ఓదార్పునిస్తారు?
- అమ్మానాన్నకి చెప్పలేం. ధైర్యం చేసి చెబితే అలా తప్పుగా అనుకోవచ్చా అని తిరిగి ఆమెనే మందలిస్తే! కోరుకునే ఓదార్పుకు ఏదీ చిరునామా?
- కళాశాల జీవితంలో స్నేహితులకే ప్రాధాన్యం. మనసునీ, ఆలోచనలనీ అర్థం చేసుకుంటారన్న నమ్మకం. వారి నుంచి ఆశించేదీ కొంచెం నమ్మకం, ఇంకొంత అభిమానం. ఒక్కోసారి ప్రేమ. కానీ అవతలివారు మనసుపై కాకుండా శరీరంపై ఆసక్తి చూపిస్తే? ప్రేమిస్తున్నానుకు బదులు కావాలనుకుంటున్నాను అంటే? గుండెకు తగిలిన షాక్కు చికిత్స చేసేదెవరు?
- ఉద్యోగమంటూ వేట సాగిస్తాం. మంచి కొలువు సంపాదించి ఆర్థిక భద్రత పొందాలనుకుంటాం. అబ్బాయిలే కాదు మేమూ అమ్మానాన్నకి అండగా ఉంటామని అని నిరూపించాలనుకుంటాం. ఇంటర్వ్యూ సమయంలో పరోక్షంగా ఇంకేదో ఆశిస్తున్నట్లు కనిపిస్తే? పోనీ.. అక్కడి నుంచి తప్పించుకుని మొండిగా ఇంకోదానికి ప్రయత్నిస్తాం.
- ఒక మంచి కొలువు దక్కించుకుని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నామా.. రోజువారీ ప్రయాణాల్లో తాత వయసువాడు బస్సులో పక్కనే కూర్చుంటాడు. వయసులో ఉన్న పోకిరీలు కావాలని తగులుతూ చిరాకు తెప్పిస్తుంటారు. వీళ్లకన్నా తాత వయసువాడు ఫ్లర్లేదు నిర్భయంగా కూర్చోవచ్చు అనుకుంటామా! నిద్ర నటిస్తూ చెత్తపనులు చేస్తాడు. భద్రత అనుకున్న స్థానంలో భయాన్నీ, కోపాన్నీ చేరుస్తాడు. ఆ సమయంలో సొంత శరీరంపై కలిగిన అసహ్యానికి ఊరట ఎవరు కలిగిస్తారు?
- కొలువు చేసే చోటా ఇదే పరిస్థితి ఎదురై, దాన్ని ఎదుర్కొని అవతలివారికి శిక్షపడేలా చేస్తే.. తప్పు చేసినవాడిది కాదు, మేమే ఏదో తప్పు చేశామన్నట్లుగా మాట్లాడితే? చూపులు, మాటలతోనే వేధిస్తే? మా తరఫున నిలుచుని తప్పుని చూపేదెవరు?
- ఊరు, ఉద్యోగం, అవసరం.. కారణమేదైనా ప్రయాణాలు అందులో భాగమే. ఎవరితో సంబంధం లేదు. స్థలముందా కూర్చుంటాం. లేదా నిల్చుంటాం. ఎవరో తెలియదు. ఏం కోపమో అర్థం కాదు. అసహ్యం వేసే మాటలు. జిగుప్స కలిగించే చేష్టలు. శరీర కొలతలపై చర్చలు. చుట్టూ వందల మంది ఉన్నా సాయం రారు. అప్పుడు కలిగిన అభద్రతకు నేనున్నామని తోడందించేదెవరు?
- కాస్త చీకటి వేళ రోడ్డు మీద ఏ బస్సు కోసమో వేచి ఉంటే.. వయసుతో సంబంధం లేకుండా వస్తావా అంటే? నేనూ మీ ఇంట్లోని వాళ్లలాంటి దాన్నే. నేనూ ఓ కుటుంబంలో కూతురిని, ఒకరి చెల్లిని, భార్యని, అమ్మని అని అరవాలనిపిస్తే.. వినడానికి ప్రయత్నించేదెవరు?
- మానసికంగా చేసే ఈ అత్యాచారాలను ఏమనాలి?
- గుండె పడే ఈ బాధ, చిత్రహింసను ఎవరికి చెప్పాలి?
- జీవితాంతం మాట కలిపే, పక్కన కూర్చునే, కలిసి పనిచేసే వారితో ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండటం తప్ప ఇంక ఏం పరిష్కారం లేదా?
- అడగాలనిపించింది. కేవలం అడగాలి అనిపించింది. అంతే! - ఇదీ సగటు ఆడపిల్ల వేదన!