హైదరాబాద్‌లో కలిసి పని చేశారు. మనసులు కలిశాయి. ఆపై కలిసి జీవించాలనుకొన్నారు. అతడి తరఫున పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకొన్నారు. అయిన వారందరిని వదిలి ఆమె అతనితో పాటు జీవిస్తోంది. చివరకు అతడే ఆమె పాలిట యముడయ్యాడు. ప్రేమించి వివాహమాడిన ఆ యువతిని కట్నం తేలేదంటూ అతి దారుణంగా హత్య చేశాడు. ఆనవాళ్లు లేకుండా చేద్దామని మంటల్లో మసి చేశాడు. సంచలనం సృష్టించిన ఈ హత్యోదంతం తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఈ హత్య కేసు దర్యాప్తును కొలిక్కి తీసుకొచ్చారు. కేసులో హతురాలు నవీపేటలోని శివతండాకు చెందిన రాధ(23)గా పోలీసులు గుర్తించారు. భర్త, అత్త కలిసి యువతిని దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.
మృతురాలు రాధ స్వగ్రామం ప్రకాశం జిల్లా అర్ధవీడు. ఆమె హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పనిచేసే సమయంలో నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లోని శివతండాకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో శివతండాలోని యువకుడి ఇంట్లో ఉంటున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటే కట్నం వచ్చేదని, తాను మరో వివాహం చేసుకొంటానని యువకుడు పలుమార్లు యువతిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.