విమానాలు, కార్లలాంటి ఖరీదైన వాహనాల్లో వచ్చి, దక్షిణ భారతదేశంలో ఏటీఎంలను దోచుకుంటున్న హర్యానాకు చెందిన దొంగల ముఠాను తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక నేరస్థుల సహకారంతో గ్యాస్ కట్టర్ల లాంటి పరికరాలను వినియోగించి ఏటీఎంలను దోచుకోవడం ఈ ముఠా నైజం.
మాస్కులు ధరించి...
దోచుకోవడానికి ముందు మాస్కులు ధరించి, ఏటీఎంల ముందు రెక్కీ నిర్వహిస్తారు. మాస్కులు వేసుకుని దోపిడీకి పాల్పడతారు. దొంగతానికి ముందు అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో షట్టర్లను, ఏటీఎం మిషన్లను కోసి అందులోని నగదును దోచుకెళ్తారని మహబూబ్నగర్ ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు.
కాలిపోయిన నగదు...
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ ఏటీఎంలో గత నెల 28న అర్ధరాత్రి ఇదే ముఠా చోరీకి పాల్పడింది. రూ. 41లక్షల 7వేల 900 నగదును అందులోంచి దోచుకెళ్లింది. గ్యాస్ కట్టర్ వినియోగించగా అందులోని నగదు కొంత కాలిపోయింది. నిందితుల నుంచి రూ. 12లక్షల 7వేలు, 40 బ్లాక్డ్ ఏటీఎం కార్డులు, చోరీకి వినియోగించిన కారు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
కేవలం 7 నిమిషాల్లో...
తొలుత మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట ఏటీఎంలపై రెక్కీ నిర్వహించారు. జడ్చర్ల సిగ్నల్ గడ్డ ఏటీఎంను లక్ష్యంగా ఎంచుకున్నారు. అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం ముందు జనరేటర్ ఉండటమే చోరీకి ఎంతగానో ఉపయోగపడిందని, కేవలం 7 నిమిషాల్లో ఏటీఎంను కోసి నగదును దోచుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.