భర్తతో గొడవలున్నాయని... విడాకుల కోసం న్యాయవాది వద్దకెళ్తే అత్యాచారానికి ఒడిగట్టాడని ఓ మహిళా ఆరోపించింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఠాణాలో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జ్యోతి నగర్లో నివాసముండే ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని 2003 సంవత్సరంలో ఫిర్యాదు చేసింది. అనంతరం 2007లో తనకు మెయింటినెన్స్ కావాలంటూ గతంలో పటాన్ చెరులోని న్యాయవాది రఘునందన్ రావు ద్వారా కేసు దాఖలు చేసినట్లు తెలిపింది.
మత్తు మందు కలిపాడు... అత్యాచారం చేశాడు
పటాన్ చెరులోని ఆయన కార్యాలయానికి సదరు మహిళను పిలిపించుకుని కాఫీలో మత్తు కలిపి ఇచ్చాడని పేర్కొంది. ఫలితంగా అపస్మారక స్థితికి చేరుకున్న తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది.