Today Crime: కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం గాయపడిన వ్యక్తి... చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప జిల్లాలో మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి రూ.40 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. కర్నూలు జిల్లాలోని హాలహర్వి సమీపంలో ట్యాక్సీ బోల్తా పడి 10 మంది గాయపడ్డారు
అనుమానంతో భార్యపై భర్త బ్లేడుతో దాడి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మురారిపల్లి గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త బ్లేడుతో దాడి చేసి... అనంతరం తానూ గొంతు కొసుకునే ప్రయత్నం చేశాడు. అసలేం జరిగిందంటే... చెన్నమ్మ అనే మహిళ... గ్రామంలోని పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తుంది. రోజూలాగే ఇవాళ కూడా ఆమె పాఠశాలకు వెళ్లి పని చేసుకుంటున్న సమయంలో... ఆమె దగ్గరకు వెళ్లిన భర్త ఒక్కసారిగా బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. భార్యపై దాడి చేసిన అనంతరం భర్త కూడా గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. దింతో చిన్న పాటి గాయమైంది. ఆమె కేకలు వేయడంతో... పాఠశాల సిబ్బంది వెంటనే 108 కు సమాచారం అందిచారు. యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తల్లీకుమారుడు అదృశ్యం: ప్రకాశం జిల్లా దర్శిలో తల్లీకుమారుడు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని దర్శి ఆస్పత్రికి వెళ్లిన తల్లీకుమారుడు... తిరిగి రాలేదని పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనారి పేర్లు... అన్నెం వెంకటలక్ష్మి, కుమారుడు లోహిత్ రెడ్డిగా పోలీసులు తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం: గుంటూరులోని ఎస్పీ స్పందన కార్యక్రమంలో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు జీజీహెచ్‌కు తరలించగా... పురుగులమందు వాసనకు ఓ కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోయారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి:కృష్ణా జిల్లా పెదపారుపూడిలో గత ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదంలో గాయపడిన జీవన్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం వృతిచెందారు. గత రాత్రి గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామానికి చెందిన జీవన్, అతని సోదరి కరుణ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని పెదపారుపూడి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... జీవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీవన్ మరణించాడు. కుటుంబంలోని ఇరువురు మృతి చెందడంతో బంధువులు రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసిన పెదపారుపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బోల్తా...రూ.40 లక్షల విలువైన మద్యం నేలపాలు: కడప జిల్లా పులివెందుల సమీపంలోని అచ్చవెల్లి గ్రామం వద్ద మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న దాదాపు రూ.40 లక్షల విలువైన మద్యం బాటిళ్లు పగిలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ప్రొద్దుటూరు నుంచి పులివెందులకు లోడు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు.
ట్యాక్సీ బోల్తా... పదిమందికి గాయాలు:కర్నూలు జిల్లా నందవరం మండలంలోని హాలహర్వి సమీపంలో శ్రీశైలం వెళ్తున్న టాక్సీ ఓవర్టేక్ చేయబోయి... అదుపుతప్పి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 భక్తులు గాయపడ్డారు. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారు కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఆటో బోల్తా... ఏడుగురికి గాయాలు:కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారులో ఉయ్యూరు నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆటో... గేదె అడ్డురావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని 108 వాహనం ద్వారా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Student Letter to Teachers: మద్యం తాగుతా.. సిగరెట్ కాలుస్తా..!