ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Today Crime: రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు

Today Crime: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో వ్యాపారి ఇంట్లో నిల్వ చేసిన గుట్కా, సిగరెట్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Today Crime In Andhara Pradesh
చీరాల సమీపంలో రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు

By

Published : Mar 30, 2022, 10:09 AM IST

Updated : Mar 30, 2022, 3:39 PM IST

Today Crime: ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ ఉప్పల్​కు చెందిన ప్రణయ్, విజయవాడకు చెందిన చిన్మయ్ కారులో రామాపురం బీచ్‌కు వెళుతున్నారు. ఒంగోలు నుంచి కారులో రేపల్లె వెళ్తున్న వెంకట్రావు ముందున్న బండిని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. క్షతగాత్రులను చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వేగానికి రెండు కార్లూ దెబ్బతిన్నాయి.

ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న కారు: గుంటూరులోని ఆటోనగర్ జాతీయ రహహరిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

వ్యాపారి ఇంట్లో నిల్వ చేసిన గుట్కా , సిగరెట్లు స్వాధీనం:ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో నిల్వ చేసిన గుట్కా , సిగరెట్ ప్యాకెట్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,17,000 రూపాయలు ఉంటుందని సీఐ పి.రమేష్ బాబు తెలిపారు. వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై నిషేధిత పొగాకు ఉత్పత్తులు సీజ్:ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై వ్యాన్​లో తరలిస్తున్న 7.5 లక్షల రూపాయల విలువచేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులను సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు పట్టుకున్నారు. ఆ సరుకును గిద్దలూరు పోలీస్ స్టేషన్​కు తరలించారు. మినీవ్యాన్​ను సీజ్ చేయడంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

నెల్లూరు జిల్లా తూర్పుకంభంపాడులో ఇల్లు దగ్ధం:నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడులో ఓ ఇల్లు దగ్ధమైంది. ఎవరో పెట్రోల్‌ పోసి నిప్పంటించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

పాయకాపురంలోని సంతోషిమాత ఆలయంలో20కేజీల పంచలోహ విగ్రహం చోరీ :విజయవాడ పాయకాపురంలో పునఃనిర్మాణంలో ఉన్న సంతోషిమాత ఆలయంలో 20 కేజీల ఉత్సవమూర్తి పంచలోహ విగ్రహం చోరీ జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ నిందితులని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ శ్రీనివాస రావు, క్రైమ్ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరా ఫుటేజ్​ను పరిశీలించారు. 30 ఏళ్ల నాటి పురాతన విగ్రహం చోరీకి గురవడంతో భక్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఫిరంగిపురం ఎస్‌బీఐలో అర్ధరాత్రి చోరీకి యత్నించిన దుండగులు:గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఎస్‌బీఐలో అర్ధరాత్రి దుండగుల చోరీకి యత్నించారు. బ్యాంకు వెనుక కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు.

పాడేరు మండలంలో ఉపాధ్యాయుల ఇంట్లో దొంగతనం: విశాఖ జిల్లా పాడేరు మండలం నమిడివీధి ప్రధాన రహదారి పక్కన ఓ ఉపాధ్యాయుల ఇంట్లో దొంగతనం జరిగింది. నాలుగు తులాల బంగారం, 45 తులాల వెండి దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.

వేటపాలెం మండలం కొత్తకాలువలో మహిళ మృతదేహం లభ్యం:ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెం బైపాస్ రోడ్​లోని కొత్తకాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు పందిళ్లపల్లి కొత్తనగర్​కు చెందిన యారాసు లక్ష్మీ (55) గా గుర్తించారు. మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వేటపాలెం ఎస్సై జి.సురేష్ తెలిపారు.

మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్క్‌ చేసిన 4 బైకులు చోరీ: మంగళగిరిలో తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో దొంగల హల్‌చల్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్క్‌ చేసిన 4 బైకులు చోరీకి గురైనట్లు కార్యాలయ సిబ్బంది గుర్తించారు. బైకుల చోరీపై తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పార్టీ కేంద్ర కార్యాలయంలో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: బొగ్గు కొరత లేకుండా చూసుకోండి.. ఏపీ ట్రాన్స్​కోకు సూచన

Last Updated : Mar 30, 2022, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details