ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తల్లిని చంపిన కుమారుడి కేసులో మరో మలుపు.. స్నేహితుడి చేతిలోనే.. - తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడి అనుమానాస్పద మృతి

Suspicious Death: కడుపున పుట్టకున్నా కన్న పేగును మించిన ప్రేమతో చూసుకున్న తల్లి పాలిట కాలయముడిగా మారాడు. ఎంతో సంబరంతో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న ఆ మాతృమూర్తిని కనికరం లేకుండా అంతమొందించాడు.. ఓ దత్తత పుత్రుడు. కానీ, తల్లిని చంపిన పాపం ఎక్కువ కాలం నిల్వలేదు. అమ్మను హతమార్చి పారిపోయిన ఆ కసాయిని మృత్యువు ఎంత దూరం వదల్లేదు. చేసిన దారుణమో వెంటేసుకెళ్లిన పాపమో.. ఆ కర్కోటకుడు కిరాతకంగా హత్యకు గురయ్యాడు.

Suspicious death of accused in mother murder case
తల్లిని చంపిన పాపం ఎక్కువ కాలం నిల్వలేదు.. స్నేహితుడి చేతిలోనే అంతమొందాడు

By

Published : May 13, 2022, 9:18 AM IST

Suspicious Death: హైదరాబాద్‌ న్యూగడ్డిఅన్నారంలో తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడు దారుణహత్యకు గురయ్యాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సాయితేజ మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. 'జంగయ్య యాదవ్‌-భూదేవి' దంపతులకు సంతానం లేకపోవడంతో 27 ఏళ్ల క్రితం సమీప బంధువు కుమారుడిని దత్తత తీసుకున్నారు. సాయితేజను తల్లి భూదేవి కంటికి రెప్పలా చూసుకొని పెంచి పెద్ద చేసింది. ఇటీవల కుమారుడికి వివాహనికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం రూ.10లక్షలు, 35తులాల బంగారం ఇంట్లో ఉంచారు. కొన్ని నెలలుగా కొందరు స్నేహితులతో తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసైన యువకుడు ఇంట్లో డబ్బులున్న విషయం తెలుసుకుని వాటిని కాజేయటానికి పన్నాగం పన్నాడు. స్నేహితుల ప్రోద్బలంతో గత శనివారం తెల్లవారుజామున తల్లి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా హత్య చేశాడు. గుండెపోటుతో చనిపోవచ్చని మొదట భావించిన భర్త బీరువాలో నగదు, బంగారం కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దారుణానికి పాల్పడింది కుమారుడేనని నిర్ధారించారు.

కాగా మూడ్రోజులుగా సాయితేజ కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలోనే నిందితుడి శవం బయటపడింది. స్నేహితుడు శివ సహకారంతో తల్లిని చంపి 10 లక్షల రూపాయలు, 35తులాల బంగారంతో పరారైన సాయితేజ... డబ్బు, బంగారం హైదరాబాద్‌లోనే ఉంచి శ్రీశైలం వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో మల్లెలతీర్థం వద్ద సాయితేజను స్నేహితుడు శివ బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం నీటి గుండంలో మృతదేహాన్ని పడేశాడు. అనంతరం, హైదరాబాద్‌ వచ్చి నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. శివ ఇచ్చిన సమాచారంతో అచ్చంపేటకు బయలుదేరిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. భూదేవి హత్యకు సహకరించిన మరో ముగ్గురు సాయితేజ స్నేహితులను ఎల్బీనగర్‌ సీసీఎస్​ పోలీసులు విచారిస్తున్నారు.

కడుపులో పెట్టుకుని పెంచిన తల్లినే.. :న్యూ గడ్డి అన్నారంలో నివసించే జంగయ్య యాదవ్, భూదేవి దంపతులకు సంతానం లేకపోవడంతో 1995లో సమీప బంధువు కుమారుడిని దత్తత తీసుకున్నారు. మూడు రోజుల వయసున్న పసికందును భూదేవి కంటికి రెప్పలా చూసుకొని పెంచి పెద్ద చేసింది. కుమారుడికి సాయితేజ అని పేరు పెట్టుకుని ఉన్నంతలో బాగా చదివించారు. ఇటీవల సాయితేజ వివాహానికి తండ్రి జంగయ్య సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి ఖర్చులు, కాబోయే కోడలి కోసం రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారం ఇంట్లో సిద్ధంగా ఉంచాడు. అంతా సవ్యంగా జరుగుతుందనే లోపల అనుకోని ఘటనలు ఆయనను కలవరపాటుకు గురిచేశాయి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న దత్త కుమారుడు.. చెడు అలవాట్లకు బానిసయ్యాడని తెలిసి కుంగిపోయాడు. తీరు మార్చుకోవాలని పలుమార్లు నచ్చజెప్పినా సాయి తేజ వినలేదు. పెళ్లి చేస్తే మారతాడులే అనుకుని సర్ది చెప్పుకొన్నారు. కానీ కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచినందుకు ఇలా తన భార్య ఉసురు తీసుకుంటాడని ఊహించుకోలేకపోయారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details