తెలిసీతెలియని వయసులో మరో ప్రేమకథ విషాదాంతమైంది. ప్రేమ పేరుతో వెంటపడిన ఓ యువకుడు పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో మద్యం మత్తులో బీరుసీసాతో ఒక యువతి తలపై కొట్టి, గొంతు కోసి చంపేసిన దారుణ ఘటన తెలంగాణలోని నాగార్జునసాగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు చందన(18)కు అనుముల మండలం కొరివేనిగూడెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శంకర్ (19) అనే యువకుడితో కొద్దికాలంగా పరిచయం ఉంది. శుక్రవారం అతడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లింది. వీరు నాగార్జునసాగర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో శంకర్ బాగా మద్యం తాగాడు. ఈ క్రమంలో పెళ్లి విషయమై వాదనలు జరిగాయి. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావని అనుమానం వ్యక్తం చేస్తూ ఆవేశానికి గురైన శంకర్.. బీరుసీసాతో చందన తలపై బలంగా కొట్టాడు. పగిలిన సీసాతో గొంతుకోయడంతో తీవ్ర రక్తస్రావమై చందన అక్కడికక్కడే మరణించింది. అనంతరం నిందితుడు హాలియా పోలీసులకు లొంగిపోయాడు. హత్య జరిగిన ప్రాంతం సాగర్ పరిధిలోకి వస్తుందని వారు నిందితుడిని సాగర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. వారు నిందితుడిని వెంటబెట్టుకొని హత్య జరిగిన ప్రదేశానికి బయలుదేరారు. కాని బాగా మద్యం మత్తులో ఉన్న కారణంగా ఎక్కడో సరిగా చెప్పలేకపోవడంతో రాత్రి 7 గంటల వరకూ పోలీసులు గాలించి చివరకు మృతదేహాన్ని గుర్తించారు.
ఎటూ వెళ్లొద్దని చెప్పా: తల్లి