ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Theft in Gold Shop: అట్టిక గోల్డ్ దుకాణంలో చోరీ...రెండు గంటల్లోనే కేసు ఛేదన - అట్టికా బంగారు దుకాణం

Theft in Gold Shop: ఓ మంచి థ్రిల్లింగ్ సినిమా సగటున 2 గంటలు ఉంటుంది. అంతే సమయంలో ఓ చోరుడ్ని పట్టుకుని అతనికే సినిమా చూపించారు విజయవాడ పోలీసులు. ఓ బంగారు దుకాణంలో దొంగతనం జరిగిందన్న ఫిర్యాదుపై శరవేగంగా స్పందించిన పోలీసులు 2 గంటల్లోనే నిందితుడిని, చోరీ సొత్తును పట్టుకున్నారు.

Theft in Gold Shop, attikagold shop
విజయవాడ బందరు రోడ్డులోని అటికా గోల్డ్ కంపెనీ

By

Published : Dec 11, 2021, 3:38 PM IST

Updated : Dec 12, 2021, 11:34 AM IST


విజయవాడ బందరు రోడ్డులోని అట్టిక బంగారు దుకాణంలో చోరీ జరిగిందన్న ఫిర్యాదు అందుకున్న పోలీసులు రెండు గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. మొత్తం 60 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న జయచంద్రశేఖర్‌... ఈ దొంగతనం చేసినట్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తెలిపారు. కృష్ణలంకకు చెందిన జయచంద్రశేఖర్‌ గత 45 రోజులుగా నగదు ఎక్కువ ఉన్న సమయంలో చోరీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు.

ఎంత పెద్ద దొంగ అయినా చిన్న తప్పు ఖచ్చితంగా చేస్తాడని పోలీసులు బలంగా నమ్ముతారు. అదే జయచంద్రశేఖర్‌ను కేవలం రెండు గంటల్లోనే పట్టించింది. దొంగతనానికి పక్కా ప్రణాళిక వేసి నకిలీ తాళాలతో చంద్రశేఖర్‌ దుకాణంలోకి ప్రవేశించాడు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా దొంగలు పగులగొట్టినట్లు తాళాలు పగులగొట్టాడు. సీసీ కెమెరాల్లో తాను కనిపించకుండా ఉండేందుకు దుప్పటి కప్పాడు. యథావిధిగా ఉదయం విధులకు సైతం హాజరయ్యాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలోనూ అతను అక్కడే ఉన్నాడు. అయితే సీసీ కెమెరాపై దుప్పటికప్పే క్రమంలో తన వేలిముద్రలు అక్కడపడిన విషయం జయచంద్రశేఖర్ గమనించలేదు. ఈ చిన్న ఆధారంతోనే పోలీసులు కేవలం రెండు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. మిత్రుడి ఇంట్లో దాచిన చోరీచేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు. బంగారు దుకాణాల భద్రతపై వాటి నిర్వాహకులతో త్వరలోనే సమావేశం నిర్వహించి తగు సూచనలు చేస్తామని తెలిపారు.

Last Updated : Dec 12, 2021, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details