ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Brutal Murder నల్గొండ జిల్లాలో సర్పంచి భర్త దారుణ హత్య - brutal murder latest news

Brutal Murder నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచి భర్త విజయ్‌రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇంటికి వెళ్తుండగా అడ్డగించి కత్తులు, గొడ్డళ్లతో కిరాతంగా హత్య చేశారు. రాజకీయ కక్షతోనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సంధ్య ఆరోపించారు. విజయ్‌రెడ్డి హత్య వెనుక ఎవరున్నారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

vijay reddy
vijay reddy

By

Published : Aug 14, 2022, 12:08 PM IST

Brutal Murder : తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తిమండలం ఎల్లమ్మగూడెం సర్పంచి సంధ్య భర్త విజయ్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్యచేశారు. పొలం పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు తొలుత ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో విజయ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మృతదేహాన్ని కాల్వలో పడేసి వెళ్లిపోయారు.

2019లో జరిగిన ఎన్నికల్లో విజయ్‌రెడ్డి భార్య సంధ్య తెరాస మద్దతుతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల‌్లో తెరాస నుంచి విజయ్‌రెడ్డికి టిక్కెట్‌ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో తెరాస నుంచి ఆయనను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌, భాజపాలో కొంతకాలం పనిచేశారు. అయితే విజయ్‌రెడ్డి భార్య సంధ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో అధికారులు ఆమెకు చెక్‌పవర్‌ రద్దుచేశారు.

నల్గొండ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి గ్రామాభివృద్ధి కోసం ఖర్చుచేసిన బిల్లులు రాకుండా కావాలనే నిలిపివేయించడం సహా చెక్‌పవర్‌ రద్దు చేశారని ఆరోపిస్తూ విజయ్‌రెడ్డి, సంధ్య కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ తరుణంలో ఆయన హత్యకు గురికావడం కలకలం రేపింది. తన భర్త హత్య వెనుక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సందీప్‌రెడ్డి. పలువురు కాంగ్రెస్‌ నేతల హస్తం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.

సంధ్య ఆరోపణల్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఖండించారు. సంధ్యకు సర్పంచిగా టికెట్‌ ఇచ్చి గెలిపించానని ఆమె భర్త ఎంపీటీసీ టిక్కెట్‌ అడిగితే ఒకే కుటుంబానికి రెండు పదవులు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్లు వివరించారు. అప్పటి నుంచి విజయ్‌రెడ్డి కాంగ్రెస్‌, భాజపా వెంట తిరిగారని.. వారే అతనిని హత్యచేసి ఉంటారని ఎమ్మెల్యే అన్నారు.

విజయ్‌రెడ్డి హత్యకు గత కొన్నాళ్లుగా సాగుతున్న భూ వివాదాలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలంలో జరిగే అవకతవకలను విజయ్‌రెడ్డి సమాచారహక్కు చట్టం ద్వారా వెలుగులోకి తేవడంతో కొంత మంది అధికారులు ఇబ్బందులు పడ్డారని, స్థానికంగా ఉన్న కొన్ని భూ వివాదాలపైనా ఆయన కోర్టుకు వెళ్లారని తెలిసింది. ఈ కారణాలతోనే ఆయనను సుపారీ ఇచ్చి హత్య చేయించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details