పాఠశాలకు సమయానికి రావాలని చెప్పినందుకు.. ప్రధానోపాధ్యాయినిపై తోటి ఉపాధ్యాయిని దాడి చేయించారు. తన భర్తతో చెప్పి ఆమెను కొట్టించారు. ఈ ఘటనలో ఆమె భర్త సహా ఏడుగురిని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గురజాల సీఐ ఉమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాధిక.. తమ పాఠశాలలో ఉపాధ్యాయిని రజని పాఠశాలకు సక్రమంగా రావడం లేదన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రాధికపై రజని కోపం పెంచుకున్నారు. ఆమె భర్త, మల్కాపట్నం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డికి చెప్పి రాధికపై దాడికి పురమాయించారు. ఈ నెల 19న పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణప్రసాద్, ప్రధానోపాధ్యాయిని పులగం రాధిక దంపతులు వాహనంపై వస్తుండగా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్దకు వచ్చి వారిద్దరిపై దాడి చేశారు. వారి వద్ద ఐదు సవర్ల బంగారం అపహరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన జొగునూరు నరేష్, కోడి నవీన్, బత్తుల శ్రీకాంత్, గొట్టపర్తి వెంకటేష్, వల్లభాయి నవీన్, మొండికత్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అరెస్టు చేసి గురజాల కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ ఉమేష్ పేర్కొన్నారు.
ATTACK: సమయానికి రమ్మన్నారని.. ప్రధానోపాధ్యాయినిపై దాడి - గుంటూరు టీచర్‌పై దాడి
తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లిలో దారుణం జరిగింది. పాఠశాలకు సమయానికి రమ్మన్నందుకు కక్ష పెంచుకున్న ఉపాధ్యాయురాలు.. తన భర్తకు చెప్పి ప్రధానోపాద్యాయురాలిపై దాడికి ఉసిగొల్పింది. దాడికి పాల్పడిన వారు అంతటితో ఆగకుండా బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
attack on school teacher in vadapally nalgonda district
ప్రధానోపాధ్యాయురాలు రాధికపై దాడి కేసులో ప్రమేయం ఉండటంతో ఉపాధ్యాయ దంపతులు రజని, శ్రీనివాసరెడ్డిలను సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బి.భిక్షపతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:'కుటుంబ సభ్యులే చంపాలని చూశారు.. ఆ ఘటనతో నా ప్రియుడికి ఎటువంటి సంబంధం లేదు'