ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

AP Crime News: ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు మృతి

AP Crime News: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. గుంటూరు జిల్లాలో బ్యాంకు దోపిడీకి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

AP Crime News
ఆర్టీసీ బస్సు బోల్తా... ఐదుగురికి తీవ్ర గాయాలు

By

Published : Apr 3, 2022, 2:49 PM IST

Updated : Apr 4, 2022, 12:00 AM IST

AP Crime News: ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి బోల్తా పడిన ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలుకాగా, మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులందరిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స అందించారు.

నగలు దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్​ నగలు స్వాధీనం:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం కొమరవోలు పంచాయతీకి చెందిన పుప్పాల శివ నాగరాజు గత నెల 30వ తేదీన మోటార్ సైకిల్ డిక్కీలో పెట్టిన నగలు మాయమయ్యాయి. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శివనాగరాజు వద్ద పని చేస్తున్న పైడి సాయి గౌతమ్ అనే వ్యక్తి డిక్కీ లోని నగలను దొంగిలించినట్లు గుర్తించారు. దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద రూ4.75 లక్షల విలువచేసే 19 కాసులు బంగారపు ఆభరణాలను స్వాధీనం చేసుకొని ముద్దాయిని రిమాండ్ కు పంపించినట్లు డీఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు.

మిస్సింగ్ కేసుగా నమోదయిన వ్యక్తి హత్య:గుంటూరు జిల్లా అమర్తలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మూల్పూరు గ్రామానికి చెందిన నూతక్కి కిరణ్ అనే వ్యక్తి మార్చి 20వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అమర్తలూరు పోలీస్ స్టేషన్​లో తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. వినయ్ హత్యకు గురైనట్లు, మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

బ్యాంకు దోపిడీకి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్:బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలైన సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. గుంటూరు కు చెందిన పల్లా రాజేష్ కుమార్ (27) ఎస్​బీఐ బ్యాంకులోకి ప్రవేశించి స్ట్రాంగ్ రూమ్​ను కట్ చేసి లోపలికి ప్రవేశించాడు. డబ్బు, బంగారం ఉన్న లాకరును తెరిచే క్రమంలో ఫోన్ అలారం మోగింది. బ్యాంకు మేనేజరు పోలీసులకు సమాచారమివడంతో ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్పెషల్ టీమ్​ను ఏర్పాటు చేసి నిందితుడు రాజేష్ కుమార్​ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు.

ప్రమాదవశాత్తు క్రేన్ పైనుంచి జారిపడి ఆపరేటర్ దుర్మరణం:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల వద్ద ఓ గ్రానైట్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది . రాజస్థాన్ నుంచి వచ్చిన మూలారామ్ (31) అనే వ్యక్తి మద్దిరాల గ్రానైట్ పరిశ్రమలో రెండు సంవత్సరాల నుంచి క్రేన్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. శనివారం విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గ్రామీణ ఎస్సై రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం:అనంతపురం జిల్లా శింగనమల మండల పెద్ద జలాలపురం గ్రామంలోని మోహన అనే వ్యక్తికి చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. ఉగాది పండుగ రోజున ఇంటిల్లిపాది పండుగ సంబరాలు చేసుకునే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమై సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. పండుగ రోజు ఇలా జరగడంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు

అదృశ్యం అయిన వ్యక్తి ..క్వారీ గుంతలో శవం అయ్యి తేలాడు:గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మార్చి 22వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో మేడి కొండూరు మండలం వైఎస్​ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కందుల సిద్ధయ్య పిలుస్తున్నారని చెప్పి అతని బంధువు ఒకరు కిరణ్ కుమారుని తీసుకెళ్లాడు. శనివారం డో కిపర్రు గ్రామంలో ఉన్న క్వారీ గుంతలో కిరణ్ శవం అయ్యి తేలాడు. కిరణ్ కుమార్ మృతిపై అతడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ చేసినట్లు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు:శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాళి మండలం కురుడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

200 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం:నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌గేట్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. లారీలో తరలిస్తున్న 200 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈతకు దిగిన విద్యార్థి గల్లంతు:కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల అగ్రహారం వద్ద ఉన్న పాలేటిలోకి దిగి ఇంటర్ విద్యార్థి గల్లంతు అయ్యాడు. వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన సంపశాల గణేష్ జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నట్లు సమాచారం. ఉగాది సెలవులు రావడంతో పది మంది విద్యార్థులు కలిసి ముత్యాలకు వెళ్లి తిరిగి వస్తూ ఈత కోసం నదిలో దిగారని తెలుస్తోంది.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి:విజయనగరం జిల్లా బోడసింగిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం మజ్జిపేటకు చెందిన తుపాకుల అప్పన్న, ధనాల రాజుగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మట్కాబీటర్లు అరెస్టు:అనంతపురం జిల్లా హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లిలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. దండు కాలనీలో ఆరుగురు మట్కాబీటర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

భారీగా గంజాయి పట్టివేత:నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. నర్సీపట్నం నుంచి చెన్నైకి గంజాయిని లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూ.21 లక్షల విలువైన 431 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

పిడకల సమరంలో అపశృతి:కర్నూలు జిల్లా కైరుప్పలలో ఏటా ఉగాది మరుసటి రోజు నిర్వహించే పిడకల సమరంలో అపశృతి చోటుచేసుకుంది. పిడకల సమరంలో 55 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. పిడకల సమరానికి స్థానికులు వేలాదిగా తరలిరావటంతో ఘటన చోటుచేసుకుంది. గ్రామం 2 వర్గాలుగా విడిపోయి పిడకలు విసురుకోవటం ఇక్కడి ఆనవాయితీ.

బాలికల మిస్సింగ్​ కేసు:తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురంలో శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు బాలికల మిస్సింగ్​ కేసును పోలీసులు చేధించారు. ఆ ముగ్గురు.. హైద్రాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. వాళ్లను తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు పిఠాపురం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పిఠాపురం పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున పిఠాపురంకు చెందిన ముగ్గురు 10వ త‌ర‌గ‌తి బాలికలు ఒకేసారి కనిపించకుండా పోయారు. దీనిపై బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పిఠాపురం పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ముగ్గురు మ‌రికొద్ది రోజుల్లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంది. ఈనేప‌థ్యంలో వీరు క‌నిపించ‌కుండా పోవ‌డంతో త‌ల్లిదండ్రుల ఆందోళ‌న మ‌రింత పెరిగింది. ముగ్గ‌రు ఏమైయ్యారో అని ఆ త‌ల్లిదండ్రులు తీవ్ర వేద‌న‌కు గురయ్యారు. తాజాగా బాలికల ఆచూకీ లభ్యం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఎడ్లబండి, బైక్​ ఢీ.. ఇద్దరు మృతి: గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చెరకుపల్లి వద్ద ఎడ్లబండిని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలిలో ఒకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులు వసంత్ బాబు, విజయ్​గా గుర్తించారు.

ఇదీ చదవండి:
తాడిపత్రిలో ఉగాది వేడుకలు.. ర్యాంప్​ వాక్​తో ఆకట్టుకున్న జేసీ దంపతులు

Last Updated : Apr 4, 2022, 12:00 AM IST

ABOUT THE AUTHOR

...view details