విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేటీకరణ పూర్తికి ఇద్దరు సలహాదారుల నియామకానికి ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం తీరుపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆందోళనలు దిల్లీకి చేరేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించినప్పుడే... రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కార్మికులు కదం తొక్కారు. విశాఖ కేంద్రంగా ఆందోళనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగానూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, బంద్‌లు జరిగాయి. కొన్ని రోజులుగా స్టీల్‌ప్లాంట్ ప్రవేశద్వారం వద్ద కార్మిక నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి గోడు పట్టించుకోని కేంద్రం.. ప్రైవేటీకరణ పక్రియను వేగవంతం చేయాలని నిశ్చయించింది.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కుకు దిక్కేది..?
దీనికి సంబంధించిన దిల్లీలో భేటీ జరిగిన కొద్దిరోజులకే... కర్మాగారం అమ్మకానికి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఇద్దరు సలహాదారుల నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిణామంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా... కేంద్రం ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇకపై ఉద్యమం అసలు రూపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.