రాష్ట్రంలో రోజుకో మహిళపై అఘాయిత్యం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ గడప దాటట్లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ సభ్యులతో అచ్చెన్న ప్రమాణం చేయించారు.
"జగన్ దౌర్భాగ్యపు పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. దుష్టపాలనకు వ్యతిరేకంగా తెదేపా రాజీలేని పోరాటం సాగిస్తుంది. అమరావతి ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడుతున్న కొందరికి ప్రజలే బుద్ధి చెబుతారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ ఇంఛార్జ్లు మహిళా విభాగానికి సహకరించాలి. రాష్ట్ర కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలి. తెదేపా మళ్లీ అధికారంలోకి రాగానే అందరి సంగతి తేలుస్తాం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం" అని అచ్చెన్న వ్యాఖ్యానించారు.
చర్యలు తప్పవ్..
కొందరు తెదేపా నాయకులు తమ బాధ్యతలు మరిచి ఇతర నేతల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని..అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తే ఊపేక్షించబోమన్నారు. ఇలాంటి పోకడలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. బాధ్యతలు అప్పగించిన ప్రాంతంలో కాకుండా ఇతరుల నియోజకవర్గాల్లో పర్యటించి ఇష్టానుసారం వ్యవహరించటం సరికాదన్నారు. పార్టీ అనుమతి లేకుండా ఇతరులు జరిపే పర్యటనలు, సమావేశాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనవద్దని సూచించారు.