విశాఖ జిల్లాలో అధికారికంగా లక్షా 50 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. విశాఖ, భీమిలి, యారాడ, రేవుపోలవరం, పూడిమడక, రాంబిల్లి ప్రాంతాలలో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విశాఖ తీర ప్రాంతంలో వరుసగా వచ్చిన పరిశ్రమల వల్ల గతంలో కంటే మత్స్య సంపద తగ్గిపోయింది. ఇది వరకు తీరం నుంచి 3 కిలోమీటర్లు ముందుకు వెళితే మంచి చేపలు దొరికేవి. అందుకు తగిన ధర వచ్చి జీవితం ఆనందంగా సాగేది. అయితే ఐదేళ్ల నుంచి చేపల సంపద తగ్గిపోయింది. సముద్రంలో ముందుకు వెళ్లే దూరం పెరుగుతోంది కానీ మంచి చేపలు దొరకడంలేదని మత్స్యకారులు అంటున్నారు.
ఖర్చు ఎక్కువ.. రాబడి తక్కువ
వేటకు వెళ్ళాలంటే 4 వలలు, బోటు ఉంటే సరిపోదు. డీజిల్, పడవలో ఉండే సిబ్బందికి జీతాలు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. డీజిల్ ధర పెరిగింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీకి, ఖర్చుకు పొంతన ఉండటంలేదని యజమానులు అంటున్నారు. పోనీ కష్టపడి వేటకు వెళ్లి తెచ్చిన చేపకు సరైన ధర ఉంటుందా అంటే అదీలేదు. ఈ కష్టాలు చాలవనుకంటే కరోనా రూపంలో మరో పెను ముప్పు గంగపుత్రుల జీవితాలను కకావికలం చేసింది. చేపల వేటకు నిషేధం విధించారు. ఇక నిషేధం ఎత్తేసిన తర్వాతా పరిస్థితి మారలేదు. ప్రభుత్వం ఇస్తానన్న రాయితీ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార యువకులకు తరాలుగా చేపలు పట్టడమే వృత్తిగా వస్తోంది. వారు చదువుపై దృష్టి పెట్టరు. కరోనా కారణంగా పనిలేక ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ పొట్టపోసుకుంటున్నామని వారు వాపోతున్నారు.
అటు ప్రకృతి కోపం.. ఇటు కరోనా శాపం