గ్రిడ్ వైఫల్యంపై సింహాద్రి ఎన్టీపీసీ వివరణ ఇచ్చింది. భారీ గాలులు, వర్షం వల్ల 2 సబ్‌స్టేషన్లు ట్రిప్ అయ్యాయని ఎన్టీపీసీ తెలిపింది. కలపాక, గాజువాక సబ్‌స్టేషన్లు ట్రిప్ అయినట్లు పేర్కొంది. ఎన్టీపీసీలో ఉత్పత్తయ్యే విద్యుత్ 2 సబ్‌స్టేషన్ల నుంచి గ్రిడ్‌కు వెళ్లాల్సి ఉందని.. 2 సబ్‌స్టేషన్లు ట్రిప్ కావడంతో సింహాద్రిలోని 4 యూనిట్లు ట్రిప్ అయ్యాయని వివరించింది. దీనివల్ల 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది.
భారీ గాలులు, వర్షం వల్లే ట్రిప్.. గ్రిడ్ వైఫల్యంపై సింహాద్రి ఎన్టీపీసీ
13:19 May 03
సాయంత్రంలోపు అన్ని యూనిట్లలో ఉత్పత్తి
నేషనల్ గ్రిడ్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 1, 4 యూనిట్లు విద్యుదుత్పత్తికి సిద్ధమైనట్లు తెలిపింది. కాసేపట్లో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొంది. 2, 3 యూనిట్లలో మరమ్మతులు చివరి దశలో ఉన్నాయని ప్రకటించింది. సాయంత్రంలోపు అన్ని యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
అసలేం జరిగింది: దక్షిణాది గ్రిడ్‌లో లోపం వల్ల విశాఖలోని సింహాద్రి, హిందూజా ఎన్టీపీసీ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాంకేతికలోపం తలెత్తడంతో.. విద్యుతుత్పత్తి నిలిచి పరిసరప్రాంతాలు అంధకారంగా మారాయి. గ్రిడ్‌కి విద్యుత్ ప్రసార లైన్లలో ఏర్పడిన సమస్య వల్ల అకస్మాత్తుగా ప్లాంట్లలోని విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా తిరిగి ఆరంభం కావడంతో సింహాద్రిలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. హిందూజాలోనూ విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకేసారి సింహాద్రి నాలుగు యూనిట్లు, హిందూజా రెండు యూనిట్లు ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారి. ఎండాకాలంలో ఇలాంటి లోపాలు తలెత్తడం వల్ల రాష్ట్రంలో మరింతగా విద్యుత్ కోతలు సంభవించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: దక్షిణాది గ్రిడ్‌లో లోపం.. ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిన విద్యుదుత్పత్తి