ప్రముఖ గాయని, పద్మ విభూషణ్ గ్రహిత, తెలుగువారు సగర్వంగా చెప్పుకునే డాక్టర్ పి. సుశీలకు కేంద్ర పోస్టల్ శాఖ అద్భుత గౌరవాన్ని ఇచ్చింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆమె పేరు మీద ప్రత్యేక తపాలా స్టాంపును ఆవిష్కరించారు. విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ ఉపకులపతి ఆచార్య పి. వీజీడీ ప్రసాద్ రెడ్డి.. తపాలా చంద్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దృశ్యమాధ్యమం ద్వారా పీ సుశీల కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున గొప్ప గౌరవాన్ని అందించారని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకున్న గాయని పేరిట పోస్టల్ దీపికను ముద్రించడం తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఉల్లాసమైన పాటలు పాడుతా.. తెలుగు వారి సంగీత సాహిత్య సౌరభాన్ని ప్రపంచ అంచులకు తీసుకెళ్లిన డాక్టర్ సుశీలను మరిన్ని అత్యున్నత పురస్కారాలు వరిస్తాయని.. తెలుగువారికే గర్వకారణమైన వ్యక్తిగా ఆమె నిలుస్తారని సమావేశంలో అతిథులు, పోస్టల్ శాఖాధికారులు కొనియాడారు.