విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల భూములను వైకాపా ప్రభుత్వం తనఖా పెట్టడాన్ని పూర్వ విద్యార్థులు తీవ్రంగా(OLD STUDENTS PROTEST) వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పూర్వ విద్యార్థులు ధర్నాకు దిగారు. కళాశాల ఎంతోమంది పేద, దిగువ, మధ్యతరగతి విద్యార్థుల తలరాతను మార్చిన పుణ్యస్థలమని వారు అన్నారు. నవరత్నాల కోసం రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని ఆరోపించారు. సంపద సృష్టించడం తెలియక అప్పులకోసం ఆస్తులను తనఖా పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే సీఎం తన సొంత సంస్థల ఆస్తులను అమ్ముకోవాలంటూ మండిపడ్డారు.
ఇందులో చదువుకున్న విద్యార్థులు చాలామంది ప్రభుత్వ రంగ సంస్థల్లో, దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని.. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కళాశాలను తనఖా పెట్టడం అంటే రాబోయే తరాల భవిష్యత్తును చీకట్లోకి నెట్టడమేనని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ రెండు కళాశాలల భూములను తనఖా నుంచి తప్పించాలని.. లేనిపక్షంలో తాము చేపట్టిన ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.