రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర, జిల్లా, ఉప, ప్రత్యేక కారాగారాల్లో సుమారు ఆరువేల మంది వరకు ఉన్నట్లు అంచనా. వారిని కలుసుకోవడానికి నిత్యం వందల మంది వస్తుంటారు. ఖైదీలకు ములాఖత్‌లను అత్యంత అమూల్యమైన విషయంగా పరిగణిస్తుంటారు. సొంతవారు, స్నేహితులు కలిసినప్పుడు వారి గుండెల్లో ఆవేదన అంతా వెళ్లబోసుకుని ఒకింత ఉపశమనం పొందుతారు. సొంతవాళ్లకు దూరమయ్యామన్న బాధ నుంచి స్వాంతన పొందుతారు. ఖైదీలు మానసికంగా కుంగిపోకుండా, ఆరోగ్యంగా ఉండడానికి ములాఖత్‌లు కీలకంగా ఉంటాయి. అలాంటి కీలకమైన ములాఖత్‌లు నిలిచిపోవడం ఖైదీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కారాగారాల్లో ఉన్నవారిని చూసే అవకాశం లేక వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
నగదు అందక ఇబ్బంది...
ఖైదీలను చూడడానికి వచ్చినప్పుడు వారి బంధువులు ఎంతోకొంత నగదు ఇచ్చి వెళ్తుంటారు. ప్రతిఖైదీకి కారాగారాల్లో పి.పి.సి.(ప్రిజనర్స్ ప్రైవేట్ క్యాష్) మొత్తాలను జైలు అధికారులే నిర్వహిస్తుంటారు. ఆ మొత్తంతో ఖైదీలు వారికి అవసరమైనప్పుడు కారాగారాల్లోపలి క్యాంటీన్లలో దొరికే ఆహారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ములాఖత్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో చాలామంది ఖైదీల పి.పి.సి. మొత్తాలు ఖాళీ అయ్యాయని, అధికారులు పెట్టే ఆహారం తప్ప సొంతంగా కొనుగోలు చేయడానికి అవకాశాలు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారాగారాలకు ఖైదీల బంధువులు మనీఆర్డర్ (ఎం.ఒ) చేయవచ్చు. కానీ చాలామందికి ఆవిషయం తెలియకపోవడంతో ఎం.ఒ పంపేవాళ్లు కూడా చాలా తక్కువమందే ఉంటున్నారని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు.