విశాఖ కలెక్టరేట్లో పరిశ్రమలు, అభివృద్ధిపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలతో సమావేశం నిర్వహించినట్లు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి వివక్షలేకుండా పరిశ్రమల అభివృద్ధికి ఊతమందిస్తామని ఆయన స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ఆకాంక్షతో పారిశ్రామిక విధానం తీసుకొచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఔత్సాహిత పారిశ్రామికవేత్తలు ఎవరు ముందుకు వచ్చినా అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రమేశ్ కమిషన్లా వ్యవహరిస్తున్నారు : మంత్రి కన్నబాబు
విశాఖలో పారిశ్రామిక ప్రగతిపై రేపు మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నట్టు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రెండు, మూడు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, ఇప్పుడు రెండో దశ కొవిడ్ విజృంభిస్తుంటే ఎన్నికలు పెడతానని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటోందన్నారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఎన్నికలు పెట్టి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు...ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎస్ఈసీని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్ఈసీ..రాజ్యాంగ సంస్థలా కాకుండా రమేశ్ కమిషన్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికలకు భయపడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. కొవిడ్ రెండో దశ దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు అనుకూల పరిస్థితులు లేవంటున్నామన్నారు. బిహార్ ఎన్నికల తర్వాత కేసులు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపా సమయంలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి భ్రమల్లో లేదని, ఎస్ఈసీ, చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. ఎస్ఈసీ కోర్టులకు వెళ్లిన తమకు ఎటువంటి అభ్యంతరంలేదని మంత్రి కన్నబాబు అన్నారు.