ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామతీర్థం ఘటనలో కుట్రకోణం: మంత్రి ముత్తంశెట్టి

రామతీర్థంలో రాముని విగ్రహాల ధ్వంసం సంఘటన దురదృష్టకరమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు.

Minister Muttamsetti Srinivas
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

By

Published : Jan 5, 2021, 1:24 PM IST

మతవిద్వేషాలు రెచ్చగొట్టే ధోరణి తెదేపా అధినేత చంద్రబాబు మానుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. రామతీర్థం సంఘటన దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు. రాముని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు.

భక్తితో కాదు.. పార్టీ కోసం వెళ్లారు: ముత్తంశెట్టి

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారైనా రామతీర్థం సందర్శించారా, ఒక్క రూపాయి అయినా ఆలయానికి కేటాయించారా ఆని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజయనగరంలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, ఇందులో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇతర దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు... ఇప్పుడెందుకు రామతీర్థం వెళ్లినట్టు అని ముత్తంశెట్టి ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైకాపా గెలవడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఆయన పార్టీ కోసం రామతీర్థం వచ్చారని, రాముడిపై భక్తితో కాదని వివరించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని... రాష్ట్రంలోని అభివృద్ధికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి భాజపా, జనసేన నాయకులు సహకరించాలని కోరారు. తమ పార్టీపై క్రిస్టియన్ ముద్ర వేయాలని చూస్తున్నారని, పార్టీలో 90% పైగా హిందువులు ఉన్నారని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:

రామతీర్థానికి నేను వెళ్తే తప్పేంటి?: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details