Lokesh letter to Governor Over AU VC Issue: ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీ-కాల్ చేసి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. వైకాపా పాలనలో.. విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని లేఖలో పేర్కొన్నారు. నిత్యం వివాదాస్పద నిర్ణయాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ వైస్ ఛాన్సలర్ పీ.వీ.జీ.డీ. ప్రసాద్ రెడ్డి ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. యూనివర్సిటీని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారని వాపోయారు.
యూనివర్సిటీలోనే వైకాపా కార్యక్రమాలు నిర్వహిస్తూ... బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత ప్రయోజనం కోసం స్టేషనరీ, పేపర్, ప్రింటింగ్ వ్యవహారాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా గెస్టు ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించి.. పదవీ విరమణ చేసిన వారిని నిబంధనలకు విరుద్ధంగా రీ-ఎంప్లాయిమెంట్ పేరిట విధుల్లోకి తీసుకోవటం కుట్రపూరితమని మండిపడ్డారు.