తొట్లకొండ భద్రత పట్ల బౌద్ధ సంఘాల్లో ఆందోళన చారిత్రక బౌద్ధ ఆనవాళ్లకు నిలయమైన విశాఖలోని తొట్లకొండపై అతిథి గృహం నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పట్ల బౌద్ధ సంఘాలు మండిపడుతున్నాయి. బౌద్ధులకు పవిత్రమైన ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... ఆయా సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు.
విశాఖలో ఎన్నో కొండలు ఖాళీగానే ఉన్నప్పటికీ, తొట్లకొండలోనే కట్టాలనే ప్రయత్నాలను ప్రశ్నించారు. నావికా దళానికి తొట్లకొండ స్థలాన్ని ఇచ్చే ప్రయత్నాలను ఒకప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ సైతం ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలోనూ సినీ క్లబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి విరమించుకున్నారన్నారు.
ఇప్పటికే తొట్లకొండపై గ్రేహౌండ్స్ దళాలకు శిక్షణ శిబిరం ఏర్పాటుపై అభ్యంతరాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం పట్ల మరోసారి బౌద్ధ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తొట్లకొండపై నిర్మాణాలకు రహస్యంగా భూమి పూజ చేసినట్లు తెలుస్తోందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో ఎన్ని నిర్మాణాలు చేసినా అడ్డు చెప్పబోమన్న ఆయన... పవిత్రమైన తొట్లకొండలో మాత్రం ఆయా ప్రయత్నాలు సరికాదన్నారు.
తొట్లకొండ భద్రతపై విశాఖలోని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇప్పటికే పోరాడుతున్నారు. గతంలో తొట్లకొండలో ఇదే తరహా ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఇదీ చదవండీ... శానిటైజర్ తాగి తల్లీకుమార్తెల ఆత్మహత్యాయత్నం