ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉక్కు' విక్రయానికి చర్యలు మొదలు.. పర్యవేక్షణ సలహాదారుల ఎంపిక!

విశాఖ ఉక్కు కర్మాగార విక్రయ పర్యవేక్షణకు ముగ్గురు సలహాదారుల ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. పర్యవేక్షణ సలహాదారుల ఎంపికకు కనీసం 2 నెలలు పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

central govt on vishaka steel plant privatisation
central govt on vishaka steel plant privatisation

By

Published : Feb 26, 2021, 5:06 AM IST

Updated : Feb 26, 2021, 5:50 AM IST

ఉక్కు విక్రయానికి చర్యలు మెుదలవుతున్నట్లు తెలుస్తోంది. దీపం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) కార్యదర్శి తుహిన్‌కాంత్‌పాండే, ఉక్కుశాఖ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ త్రిపాఠీ, న్యాయశాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌ మెదిరట్టా, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి తరుణ్‌బజాజ్‌, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి రాజేశ్‌వర్మ, వ్యయ కార్యదర్శి టీవీ సోమనాథన్‌, ప్రభుత్వరంగ సంస్థల శాఖ కార్యదర్శి శైలేష్‌, దీపం, ఉక్కుశాఖల ఆర్థిక సలహాదారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ... పర్యవేక్షణ సలహాదారుల ఎంపికకు అవసరమైన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ తయారీని మొదలుపెట్టినట్లు సమాచారం. పర్యవేక్షణ సలహాదారుల ఎంపికకు కనీసం 2 నెలలు పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఎంపికైన సలహాదారులు.. విశాఖఉక్కును కొనేందుకు ముందుకొచ్చే వారిని ‘ఆసక్తి వ్యక్తీకరణ’కు ఆహ్వానించే పత్రాన్ని తయారుచేస్తారు. కేబినెట్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని ‘కేబినెట్‌ కోర్‌ గ్రూప్‌ ఆన్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌’ ఈ పత్రంపై ఆమోదముద్ర వేస్తుంది. తర్వాత దానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో కూడిన ప్రత్యామ్నాయ యంత్రాంగం పచ్చజెండా ఊపాల్సి ఉంటుంది.

పునరాలోచించండి : ఎంపీల వినతి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించాలని ఉక్కు స్థాయీసంఘం ఛైర్మన్‌ రాకేశ్‌సింగ్‌కు వైకాపా ఎంపీలు బి.వి.సత్యవతి, మోపిదేవి వెంకటరమణారావు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో గురువారం జరిగిన స్థాయీసంఘం సమావేశంలో వారు ఆయనకు వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ మద్దతు పలికారు.

అమ్మే ఆలోచన వద్దు: వామపక్షాలు

విశాఖ ఉక్కు కర్మాగార విక్రయ ఆలోచనను విరమించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. కర్మాగారం అమ్మకానికి విధి విధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడాన్ని ఖండించాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్‌), ఎంసీపీఐ(యు), సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఎస్‌యూసీఐ(సి), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ప్రైవేటీకరణ నిలుపుదలకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశాయి. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని కోరాయి.

'రాష్ట్ర వ్యాప్తంగా వివిధ తరగతుల ప్రజలు, కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు విక్రయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై లేఖ కూడా రాసింది. తెలుగు ప్రజలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న భాజపా ప్రభుత్వం ఉక్కు కర్మాగారం అమ్మకానికి మంత్రులు, అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం రాష్ట్రానికి ద్రోహం చేయడమే. కేంద్రం వెంటనే ఈ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలి.' వామపక్షాలు అని డిమాండ్‌ చేశాయి.

ఉక్కు ఉద్యమానికి మావోయిస్టు పార్టీ మద్దతు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి సీపీఐ మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి కైలాసం ఓ లేఖ విడుదల చేశారు. ‘ప్రధాని మోదీ కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల విశాఖ ఉక్కులో కార్మికులు హక్కులను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంత పెద్ద కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ప్రైవేటుపరం చేయడం అసాధ్యం. ఈ విషయంలో జగన్‌ చెబుతున్నదంతా బూటకం. వ్యవసాయ బిల్లుల విషయంలో రాష్ట్ర సర్కారు రూ.4 వేల కోట్లకు కేంద్రానికి అమ్ముడుపోయింది. విశాఖ ఉక్కు విషయంలో మోదీకి లేఖ రాశానని, మేం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకమేనని ప్రజల్ని మోసపుచ్చేందుకు జగన్‌ యత్నిస్తున్నారు. ఉక్కు కార్మికులపై ప్రేమ, సానుభూతి ఉంటే జగన్‌ ప్రభుత్వం, వైకాపా ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలి’ అని కైలాసం డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్​ పరీక్షలో అక్రమాలు.. స్క్రీన్​షాట్లతో జవాబులు

Last Updated : Feb 26, 2021, 5:50 AM IST

ABOUT THE AUTHOR

...view details