తూర్పు తీరంలో మరో భారీ నేవీ ఉత్సవం జరగనుంది. మార్చి నెలలో మిలన్ - 2020 పేరిట అంతర్జాతీయ నేవీ ఉత్సవానికి విశాఖ ఆతిథ్యమివ్వనుంది. తూర్పు నౌకాదళం ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) నిర్వహించిన అనుభవంతో.... మిలన్ - 2020 నిర్వహిస్తోంది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు విశాఖ తీరానికి రానున్నాయి. ఇప్పటికే 41 దేశాలకు అహ్వానాలు పంపగా 30 దేశాలు మిలన్ 2020లో పాల్గొంటున్నట్లు ధ్రువీకరించాయి. విదేశీ నౌకా దళాల్లో ఒక్కో దేశం నుంచి రెండు, మూడు నౌకలు వచ్చే అవకాశం ఉంది.
సాగరతీరం మరింత సుందరంగా
మార్చి నెలలో జరిగే ఈ మెగా ఉత్సవం కోసం సాగరతీరం ముస్తాబు కానుంది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం సిద్ధమవుతున్న విశాఖలో.... ఈ ఉత్సవం ద్వారా బీచ్రోడ్ను మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. విశాఖ మహా నగర పాలక సంస్థ కమిషనర్, పోలీసు కమిషనర్ సహా వీఎంఆర్డీఏ, పోర్టు ట్రస్ట్, హెచ్పీసీఎల్, ఐఓసీ, వంటి సంస్థలతో తూర్పునౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్.ఎన్ ఘోర్మడే ప్రత్యేకంగా సమీక్షించారు. వారి నుంచి అవసరమైన సహకారాన్ని కోరారు.