కాదేదీ చిత్రకారుడి సృజనాత్మకతకు అనర్హం. కళాత్మక దృష్టి ఉంటే చాలు... రహదారి అయినా, ఎయిర్ పోర్టు లాంజ్ అయినా... ఇట్టే చూడముచ్చటగా మారిపోతుంది. విశాఖలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ లలిత కళల విభాగంలో చిత్రలేఖనం, శిల్పం అభ్యసించే విద్యార్థులు, అధ్యాపకులు...తీర్చిదిద్దిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా నగరంలోని ప్రధాన రహదారులు, ప్రముఖ ప్రదేశాలు వీరి ప్రతిభ ప్రతిబింబిస్తున్నాయి.
విశాఖ విమానాశ్రయంలో స్థానిక విశేషాలకు దర్పణం పట్టేలా వివిధ చిత్రాలు రూపొందించారు. ఈ చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ జిల్లా ఒక వైవిధ్యభరితమైన ప్రాంతం. సాగర తీరం, గిరిజన సంస్కృతి, నగరమంతా కాస్మోపాలిటన్ కళ.. ఇలా వీటన్నింటిని చాటి చెప్పేలా ఈ చిత్రాలు పరుచుకున్నాయి. ఇవన్నీ అంధ్ర విశ్వవిద్యాలయం నిపుణులు ఇచ్చిన అలోచనలతో రూపుదిద్దుకున్నాయి.