విజయనగరం జిల్లా కొమరాడలో బయటపడ్డ పింఛను నకిలీ పత్రాల వ్యవహారం విశాఖ కేజీహెచ్‌లో కలకలం రేపుతోంది. పత్రాల మంజూరులో ఇక్కడున్న ఇద్దరు కింది స్థాయి అధికారుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇందులో మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం జేసీ అరుణ్‌బాబు కేజీహెచ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు కొమరాడకు చెందిన నలుగురు వ్యక్తులు ఈ తరహా ధ్రువీకరణ పత్రాలు పొందారని, వారి వివరాలు కేజీహెచ్ రికార్డుల్లో లేనట్లు గుర్తించారు. ఏఎంసీ ప్రిన్సిపల్ పీవీ సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ మైథిలి సమక్షంలో ఈ తనిఖీలు చేశారు. పెథాలజీ విభాగాన్నీ సందర్శించారు. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉండటంతో లోతైన విచారణ కోసం జేసీ గోవిందరావు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గత ఆరు నెలల దస్త్రాలను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.
సెక్యూరిటీ గార్డు ద్వారా
కేజీహెచ్‌లో గతంలో పనిచేసిన ఓ సెక్యూరిటీగార్డు ఈ వ్యవహారంలో కీలకంగా మారినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అతనే కొమరాడ ప్రాంతంలో పలువురికి ఈ ధ్రువపత్రాల్ని ఇప్పించారని చెబుతున్నారు. కేజీహెచ్‌లో ఎలాంటి పరిశీలన లేకుండానే ధ్రువపత్రాల జారీ అయిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.