తూర్పు నౌకాదళంలో భాగంగా ఉన్న విశాఖ నేవల్ డాక్ యార్డు నిపుణుల బృందం రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ల సమర్ధ ఉత్పత్తికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఈ బృందం... అధికారులతో కలసి నెల రోజులుగా పలు నగరాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా పద్ధతులను పరిశీలించి పలు సూచనలు చేసింది. అవసరమైన మరమ్మతులు నిర్వహించింది. నిర్వహణలో ఏర్పడే సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయాలపై అక్కడి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించింది.
యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో ఆక్సిజన్ సరఫరా సమయంలో వాడే పద్ధతులను బృంద సభ్యులు.. సిబ్బందికి వివరించారు. దీని ద్వారా బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు అందించవచ్చని తెలిపారు. పోర్టబుల్ మల్టీ ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ను స్థానికంగా ఉన్న పరిశ్రమ కార్మికులే ఎలా తయారు చేయాలో చెప్పారు. నెల్లూరులోని శ్రీకృష్ణ తేజ ఎయిర్ ప్రొడక్ట్స్ సంస్థలో 2012 నుంచి ఉత్పత్తి లేకుండా పడిఉన్న క్రయోజెనిక్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను తిరిగి వినియోగంలోకి తెచ్చే సాంకేతిక సహకారం అందించారు.