ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధికార పార్టీలో అసంతృప్తి సెగలు - ఏపీలో ఇసుక విధానం తాజా వార్తలు

అధికార పార్టీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి.. పార్టీ ప్రజాప్రతినిధులే నిరసన గళమెత్తుతున్నారు. పదవులు చేపట్టి ఏడాదయినా.. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఏమీ చేయలేకపోతున్నామని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీలో అసంతృప్తి సెగలు
అధికార పార్టీలో అసంతృప్తి సెగలు

By

Published : Jun 6, 2020, 5:38 AM IST

Updated : Jun 6, 2020, 5:46 AM IST

ఇసుక కొరత, తాగునీటి ఇబ్బంది, ఇతరత్రా సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులే.. స్వరం పెంచుతున్నారు. ఎంత ప్రయత్నించినా దోసెడు ఇసుక కూడా దొరికే పరిస్థితి లేదని, అంతటా ఆన్‌లైన్‌ మాయాజాలం నడుస్తోందని కొందరు మండిపడుతున్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం చొరవ చూపడం లేదని మరికొందరు ఆక్షేపిస్తున్నారు. మంత్రులకు నివేదికలు ఇచ్చినా పనులు జరగడం లేదని నిష్టూరమాడుతున్నారు. ఇలా గళం వినిపిస్తున్న వారిలో ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులూ ఉన్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుక సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక విధానం అమల్లో ఏపీఎండీసీ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

‘అధికార పార్టీ ఎమ్మెల్యేనైన నేనే చెబుతున్నా. ఇసుక ఇవ్వడంలో ఏపీఎండీసీ విఫలమైంది. కోనసీమలోని నా నియోజకవర్గ పరిధిలో 10 ఇసుక ర్యాంపులు ఉన్నా ఒక్కటీ ప్రారంభించలేదు. వశిష్ట, గౌతమి గోదావరి చుట్టూ ఇసుక ఉన్నా ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పొడగట్లపల్లిలో రేవు నిర్మాణానికి రెండు ట్రాక్టర్ల ఇసుక కావాలని కలెక్టర్‌, డీఎస్పీ, రెవెన్యూ అధికారులకు లేఖ రాశా.. అయినా దొరకలేదు’ అని జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. ఎస్‌ఈబీ జిల్లా అదనపు ఎస్పీ గరుడ సుమిత్‌ సునీల్‌ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని సీఆర్సీలో ఇసుక తరలింపుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘కాలువ రేవు నిర్మాణానికి ఇసుక కోసం ఏపీఎండీసీకి గుత్తేదారు రూ.14 వేలు చెల్లించారు. అనుమతి పత్రం ఇచ్చి మూడు రోజులైనా ఇసుక సరఫరా చేయలేదు. ఆత్రేయపురం మండలం తాడిపూడి ఇసుక ర్యాంపు కోసం బాట వేసినా.. సీసీ కెమెరాలు లేవని నిలిపేశారు. ఆన్‌లైన్‌లో ఇసుక ఆర్డర్‌ ఇద్దామనుకుంటే అయిదు నిమిషాల్లోనే అయిపోతోంది. గోదావరిలో దొరికే బొండు ఇసుకనూ ఇవ్వకపోవడంతో 45 కిలోమీటర్ల దూరం వెళ్లి గ్రావెల్‌ తెచ్చుకుని ఇంటి పునాదులు పూడుస్తున్నారు. పొలాల్లో మెరక మట్టిని తరలిస్తున్న రైతులపైనా అనుమతుల్లేవని కేసులు పెడుతున్నారు. ముందు నాపై కేసు పెట్టండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం చెప్పినా లెక్కలేదు

‘అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోందని కేకులు కోసి సంబరాలు చేసుకుంటున్నాం తప్ప.. నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోయాం’ అని వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసి ఏడాదైనా.. బిల్లులు చెల్లించకపోవడమేమిటని నిలదీశారు. ఆయన వరుసగా రెండు రోజులపాటు ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై విమర్శలు సంధించారు. ‘అభివృద్ధి పనులపై సాక్షాత్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వివరించి లేఖ ఇచ్చాను.. పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించినా నేటికీ స్పందన లేదు, ఆ లేఖ ఎక్కడుందో కూడా తెలియదు’ అని మండిపడ్డారు. సీఎం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయి తప్ప.. నియోజకవర్గానికి ఒక్క రూపాయి తెచ్చి అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వెంకటగిరి మున్సిపాల్టీలో రోడ్డు, కాలువ, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు నివేదిక తయారు చేసి.. నేనే స్వయంగా పురపాలక మంత్రికి ఇచ్చా. కానీ రూపాయి మంజూరు కాలేదు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రిని అడిగినా స్పందించలేదు. సీఎం సిఫార్సు లేఖ ఇచ్చినా శాశ్వత తాగునీటి పథకాల తొలి జాబితాలో వెంకటగిరికి చోటివ్వలేదు. అంటే ఈ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ లేదా? సోమశిల ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని కోరితే పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని మండిపడ్డారు.

ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుడి పోస్టును రూ.లక్షకు గుత్తేదారులు అమ్ముకుంటున్నారని సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ముంబయికి చెందినవారికి కాంట్రాక్టు ఇస్తే ఇలాగే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలోనే కుండ బద్దలు కొట్టారు.

ప్రభుత్వానికి మాయని మచ్చ

రూ.15 వేలు ఉండే అయిదు యూనిట్ల ఇసుక లారీని దళారులు రూ.40 వేలకు విక్రయిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ‘ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో నిల్వలు అయిపోతున్నాయి. దళారుల దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతోంది. ఇదంతా ఎలా జరుగుతోంది? ఆన్‌లైన్‌ బుకింగే మాయాజాలం. నిల్వ కేంద్రాల్లో నాసిరకం ఇసుక ఉంటే.. నాణ్యమైనది ఎక్కడికో పోతోంది’ అని మండిపడ్డారు. ఇసుక సమస్య ప్రభుత్వానికి మాయని మచ్చగా మారుతుందన్నారు.

తాగునీటి సమస్యలు పట్టవా?

జూన్‌ వచ్చినా తాగునీటి సమస్యపై సమీక్షా సమావేశం పెట్టలేదు, జిల్లా అధికారులకు ఇదేమి నిర్లక్ష్యం అని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి విమర్శించారు. జిల్లా అధికారికి ఫోన్‌ చేసినా ఏదో ఒక సమావేశంలో ఉన్నామంటూ సమాధానమిస్తున్నారని అసంతృప్తి వెలిబుచ్చారు. నా నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోందా? అన్నిచోట్లా ఇలాగే చేస్తున్నారా? అని మండిపడ్డారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ రూ.100 కోట్లు ఇస్తే ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? అని నిలదీశారు.

దోసెడు ఇసుక ఇచ్చే పరిస్థితి లేదు

‘రీచ్‌ నుంచి యార్డుకు వచ్చేప్పటికే ఇసుక లారీ మాయమవుతోంది. మీరు అన్నీ మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నా. ఏ ఒక్క పల్లెటూళ్లోనూ దోసెడు ఇసుక ఇచ్చే పరిస్థితి లేదు. కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. ఇసుక విధానం, అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే ఆయన విమర్శలు చేశారు.

నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయింది

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి అడుగంటిందని.. సాగు, తాగునీటి పథకాల పనులు నిలిచిపోయాయని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు బహిరంగంగానే విమర్శించారు. ‘పింఛన్లు అందడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. రహదారుల పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. ఎవరిని అభ్యర్థిస్తే సమస్యలు పరిష్కారమవుతాయో తెలియని స్థితి నియోజకవర్గంలో నెలకొంది’ అని ధ్వజమెత్తారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఇసుక సరఫరాలో అధికారులు విఫలం: వైకాపా ఎమ్మెల్యే

Last Updated : Jun 6, 2020, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details