కరోనా వ్యాప్తి దృష్ట్యా వినాయక చవితికి పందిళ్లు వేయకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనను.. భాజపా నేతలు వక్రీకరిస్తున్నారని వైకాపా ఆరోపిస్తోంది. పండుగలపై రాష్ట్రంలో అబద్దాలు ప్రచారం చేస్తూ హిందువులను రెచ్చగొట్టేలా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.
కరోనా కట్టడికోసం బహిరంగ ప్రదేశాల్లో రద్దీ లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలిచ్చిందని.. దాన్ని సోము వీర్రాజు ముందుగా గమనించాలని హితవుపలికారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడంలేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వానికి అన్ని సామాజిక వర్గాలూ సమానమేనన్న మల్లాది.. రంజాన్, బక్రీద్లకూ గతంలో ఇదే తరహాలో ఆంక్షలు విధించామన్నారు.