Women Commission notice to Chandrababu: తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో ఉన్న నోటీసు కాపీని రాష్ట్ర మహిళా కమిషన్ ఉద్యోగులు.. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఇచ్చారు. మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలంటూ కమిషన్ జారీ చేసిన నోటీసులను తెదేపా కార్యాలయ సిబ్బంది తీసుకున్నారు. అలాగే.. ఈనెల 27న మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలంటూ.. విజయవాడలో బోండా ఉమా ఇంటికి వెళ్లి స్వయంగా నోటీసులు అందచేశారు. అయితే.. నోటీసుల్లో పేర్కొన్న తేదీలపై గందరగోళాన్ని బోండా ఉమా తప్పుబట్టారు. నోటీసులపై న్యాయపరంగా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ తెదేపా అధినేత చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.