దేశంలో ఉన్న 661 నవోదయ పాఠశాలలు, పూర్వ విద్యార్థులందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా తొలిసారి ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అనంతపురం జిల్లాకు చెందిన జవహర్ నవోదయ విద్యాలయం పూర్వ విద్యార్థిని పద్మజ, తెలంగాణలోని ఆదిలాబాద్ జేఎన్‌వీ పూర్వ విద్యార్థి వినీల్‌కుమార్ నేతృత్వంలో ఈ వెబ్‌పోర్టల్‌ను రూపొందించారు. నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్‌గార్గ్ ఈ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. అంతర్జాలంలో వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవిదేశాల్లో స్థిరపడిన నవోదయ పాఠశాలల పూర్వవిద్యార్థులు, ఎన్‌వీఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిత్య ప్రకాష్‌సింగ్, ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్లు పాలొన్నారు. దేశంలోని అన్ని జేఎన్‌వీలను అనుసంధానించేందుకు ఈ వెబ్‌పోర్టల్ ఉపయోగపడుతుందని పద్మజ అన్నారు.
పూర్వవిద్యార్థులతో అనుసంధానించడమే లక్ష్యం
ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 2.65లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వీరందరినీ పూర్వవిద్యార్థులతో అనుసంధానించడమే లక్ష్యంగా ప్రారంభించినట్టు వారు తెలిపారు. ఈ పోర్టల్‌లో అన్ని పాఠశాలల పూర్వ విద్యార్థుల సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. నవోదయ విద్యార్థులు ప్రస్తుతం దేశవిదేశాల్లో అనేక ఉన్నత పదవుల్లో ఉన్నారని తెలిపారు. వారందరి సహకారం ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులకు అందజేస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, విభిన్న వ్యక్తుల సమూహంగా http://www.nvsalumni.com/ వెబ్‌పోర్టల్ నిలవబోతోందని పేర్కొన్నారు.