పూర్తిగా వరద తగ్గాకే ఇళ్లకు పంపిస్తాం: కమిషనర్
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వరద నీరు పూర్తిగా తగ్గాకే బాధితులను తిరిగి ఇళ్లకు పంపిస్తామని కమిషనర్ వెల్లడించారు.
కృష్ణా జిల్లాలోని వరద బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాన్ని కమిషనర్, ఎమ్మెల్యే సందర్శించారు. క్రెడాయ్, ట్రెండ్ సెట్ మాల్, హోటళ్ల సంఘం ప్రతినిధుల వరద బాధితులకు దుప్పట్లు, దుస్తులు అందించారు. వాటిని శిబిరంలో ఉన్నవారికి పంపిణీ చేశారు. వరదనీరు తగ్గేందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందన్న కమిషనర్.... అప్పటి వరకు బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉంటారని చెప్పారు. వరద కారణంగా పేరుకుపోయిన బురదను తొలిగించడానికి నగర పాలక సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బాధితులను ఇళ్లకు తరలిస్తామని స్పష్టం చేశారు.