విజయవాడ నగరాన్ని వణికిస్తున్న మత్తు పదార్ధం ఎఫిడ్రిన్ సరఫరా కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక నిందితుడు చెన్నై వాసిగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు . నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని చెన్నైకు పంపారు. భారతీనగర్ కొరియర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు . పార్శిల్ చేసిన నిందితుడి విజువల్స్ సేకరించారు . దీంతో పాటు కొరియర్ తేజకు ఇచ్చిన ఆధార్ జిరాక్స్‌ను పరిశీలించారు. జిరాక్స్లో అడ్రస్ గోపీసాయిది ఉన్నా.. ఫోన్ నెంబర్, ఫొటో వేరే వారిది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఫోన్ ఆధారంగా ట్రాకింగ్ చేస్తే చెన్నైలో ఉన్నట్లు తేలింది.
గతంలో మూడుసార్లు కొరియర్ ద్వారా పార్శిల్ పంపిన వ్యక్తి ఇతనేనని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. గోపిసాయి చెన్నైలో ఇంజినీరింగ్ చదివి ఇటీవల హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం సొంతూరు నుంచి పని చేస్తున్నాడు. చెన్నైలో చదివేటప్పుడు గోపిసాయి జిరాక్స్‌ను ఎవరో తీసుకుని ప్రస్తుతం వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గోపికి పరిచయమున్న వ్యక్తా ? అతనితో చదువుకున్న యువకుల్లో ఎవరైనా ఈ దందా కొనసాగిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.