ఒక వైపు వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెబుతూ.. మరోవైపు రైతు 17 నెలల కాలంలో అనేక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతు రుణ మాఫీ కింద 8 వేల కోట్లు ఎగ్గొట్టారన్నారు. ప్రతి రైతుకు భరోసా కింద అధికారంలోకి వచ్చాక 5 వేల కోత కోశారని... ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చేతులెత్తేశారని విమర్శించారు.
అమరావతి ప్రాంతంలో రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన రైతు వ్యతిరేక ప్రభుత్వం... వైకాపా ప్రభుత్వం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు ఆమోదం తెలిపి రైతులకు అన్యాయం చేసిందని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకంకి మంగళం పాడారని.. మీటర్ల బిగింపు కోసం జీవో జారీ చేశారని ధ్వజమెత్తారు. సున్నా వడ్డీ పథకం లక్ష రూపాయలకు పైన రుణం తీసుకునేవాళ్లకు వర్తించదు అని... సున్నా వడ్డీ విషయంలోనూ రైతులను మోసం చేశారన్నారు.