ఏపీ, తెలంగాణ విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. బుధవారం తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ని విజయవాడలో వారు కలిశారు. ఇటీవల జరిగిన కారు ధ్వంసం ఘటనపై చర్చించారు. పాలకుల అవినీతి, అన్యాయాలను ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురవుతున్న తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తామని తెతెదేపా నేతలు వెల్లడించారు.
పట్టాభిని కలిసిన తెలంగాణ తెదేపా నేతలు
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నించినందుకే పట్టాభి కారుపై దాడి జరిగిందని తెలంగాణ తెదేపా నేతలు విమర్శించారు. దాడులు, విధ్వంసాలు, బెదిరింపులు తెదేపా నేతలను ఆపలేవని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో పట్టాభితో వారు సమావేశమయ్యారు.
వైకాపా ప్రభుత్వ అవినీతిని, అన్యాయాలను, అక్రమాలను ప్రతిపక్షం తరఫున కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సమర్థవంతంగా ప్రశ్నిస్తున్నాడన్న అక్కసుతోనే.... ఆయన కారుని ధ్వంసం చేయించిందని ఆరోపించారు. దాడులు, విధ్వంసాలు, బెదిరింపులు తెదేపా నేతలను ఆపలేవనే విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, తెలంగాణ తెదేపా అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, తెలంగాణ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి తెనాలి శ్రవణ్ కుమార్... పట్టాభిని ఆయన నివాసంలో పరామర్శించారు. పట్టాభి గొంతు నొక్కాలి అని చూస్తే... ఇంకా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వ అవినీతిని బయటపెడతారన్నారు.