Justice N. V. Ramana : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక అని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారానే కేసుల పరిష్కారం మేలని పేర్కొన్నారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చునని సూచించారు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. మహిళలు సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్పారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం.. ఐఏఎంసీ నేటి సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఐఏఎంసీ ప్రారంభం కానున్నట్లు సీజేఐ వెల్లడించారు.
చివరి ప్రయత్నంగానే కోర్టుకు రావాలి..
IAMC conference 2021 : కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పెండింగ్ కేసుల సత్వర విచారణ జరగాలని చెప్పారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని... . అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
ఐఏఎంసీ సన్నాహక సదస్సు
Hyderabad IAMC conference : హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం... ఐఏఎంసీ సన్నాహక సదస్సు నేడు ప్రారంభమైంది. హెచ్ఐసీసీలో జరుగుతున్న సదస్సు ప్రారంభోత్సవానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. 20 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌కు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. భూమి కేటాయించినా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు.
చర్చాగోష్ఠులు..
సదస్సు అనంతరం రెండు ప్యానెల్‌ల చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ప్రక్రియ, వినియోగదారుల అంచనాలు అనే అంశంపై జరిగే చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ పి.ఎస్.నర్సింహా, తదితరులు పాల్గొంటారు. ఆర్బిట్రేషన్, మీడియేషన్ ఉద్దేశాలపై చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీ రామారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ లైఫ్ ట్రస్టీ జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ ప్రసంగిస్తారు.