ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి: తెదేపా

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 144 ఘటనలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp leaders met governor
tdp leaders met governor

By

Published : Jan 7, 2021, 11:56 AM IST

Updated : Jan 8, 2021, 5:34 AM IST

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. మత స్వేచ్ఛను కాలరాస్తూ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం ఆ పార్టీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న, తెనాలి శ్రావణ్‌కుమార్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల వినతిపత్రంతో పాటు 140 దాడులపై నివేదికలు, పెన్‌డ్రైవ్‌ అందజేశారు. ‘ప్రభుత్వ రహస్య ఎజెండాతోనే వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయి. దేవుడికే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల పరిస్థితేంటో గమనించాలి. రామతీర్థం ఘటన జరిగిన మరునాడే ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో పర్యటించారు. విగ్రహ ధ్వంసంపై స్పందించకపోగా ఆలయాన్నీ సందర్శించలేదు. జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న దేవాదాయశాఖ మంత్రీ స్పందించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే తెదేపా అక్కడ ఆందోళన చేపట్టింది’ అని గవర్నర్‌కు వివరించారు.

ఆలయాలపై ఘటనలకు బాధ్యత ప్రభుత్వానిదే: తెదేపా నేతలు
చంద్రబాబుపై కేసు పెడతారా?గవర్నర్‌తో భేటీ అనంతరం తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 140 ఆలయాలపై దాడులు జరిగాయా’ అని గవర్నర్‌ ఆశ్చర్యంగా ప్రశ్నించారని తెలిపారు. చంద్రబాబు ప్రసంగంపై న్యాయ సలహా కోరతామని డీజీపీ సవాంగ్‌ చెప్పడాన్ని వర్ల ఖండించారు. చంద్రబాబుపై కేసు పెట్టాలని చూస్తే తదుపరి పరిణామాలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ‘జగన్‌ తమ ఆత్మగా చెప్పుకొనే కొందరు మఠాధిపతులు, స్వామీజీలు ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మీరు కూడా రాజకీయాల కోసమే ఉన్నారా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెడితే ముఖ్యమంత్రి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Last Updated : Jan 8, 2021, 5:34 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details