ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోజుకో దాడి.. పూటకో విధ్వంసం.. ఇదే సీఎం జగన్ పాలన: తెదేపా - సీఎం జగన్​పై దేవినేని ఉమ విమర్శలు

సీఎం జగన్ పాలనలో పూటకో దాడి.. రోజుకో విధ్వంసంతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైందని తెదేపా నేతలు విమర్శించారు. పట్టాభి కారు ధ్వంసం వైకాపా నేతల పనేనని కళా వెంకట్రావు, దేవినేని ఉమ ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే.. కారు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎన్ని చేసినా తాము భయపడేది లేదని తేల్చిచెప్పారు.

tdp leaders about pattabhi car destroyed
పట్టాభి కారు ధ్వంసంపై తెదేపా నేతల ఆగ్రహం

By

Published : Oct 4, 2020, 1:30 PM IST

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం కారుపై దాడి.. వైకాపా నేతల పనేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీఎం జగన్ పాలన.. హిట్లర్, గడాఫీల కంటే దారుణంగా తయారైందని ధ్వజమెత్తారు. రోజుకో దాడి, పూటకో విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ రావణకాష్టం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తూ మీడియా ముందు వైకాపా నేతల అక్రమాలను బట్టబయలు చేస్తున్నారనే కక్షతోనే పట్టాభిరాం కారుపై దాడి జరిగిందన్నారు.

ధైర్యం ఉంటే పట్టాభి అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్న పట్టాభికి సమాధానం చెప్పలేకే.. కారు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య అని ధ్వజమెత్తారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కారు ధ్వంసం ఘటనపై సీపీఐ రామకృష్ణ, తెదేపా సీనియర్‌ నేతలు యనమల, అచ్చెన్నాయుడులు పట్టాభికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details